canada: భారత్‌తో కెనడా విభేదాల వెనుక ఎవరు..?

భారత్‌-కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్రూడో రాజకీయ బలహీనత దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆయన  ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఓ పార్టీ ఖలిస్థానీలకు బలమైన అండగా నిలుస్తోంది. 

Updated : 19 Sep 2023 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్‌-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ను ధ్వంసం చేసి.. ‘‘జూన్‌ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించడంతో ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. వీటన్నింటి వెనుక ట్రూడో రాజకీయ బలహీనత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని.. మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ట్రూడో రాజకీయ బలహీనత..

2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వ రాజకీయ బలహీనత ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారింది. 2021 ఎన్నికల్లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఉన్న మొత్తం 338 స్థానాల్లో ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ సీట్లు 177 నుంచి 150కి తగ్గాయి. అదే సమయంలో కన్జర్వేటీవ్‌ పార్టీకి 121, నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ)కి 24, బ్లాక్‌ క్యూబెక్స్‌కు 32, గ్రీన్‌ పార్టీకి 3, స్వతంత్ర్య అభ్యర్థికి ఒకటి చొప్పున సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ట్రూడోకు మరికొన్ని సీట్ల అవసరం వచ్చింది. దీంతో జగ్మీత్‌ సింగ్‌ ధాలివాల్‌ (జిమ్మీ) నేతృత్వంలోని ఎన్‌డీపీ మద్దతు తీసుకొన్నారు. ఎన్‌డీపీ నాయకులు ఇప్పటికే పలు మార్లు ఖలిస్థానీ వేర్పాటువాదులకు, వారి ఎజెండాకు మద్దతు పలికారు. 2013లో జగ్మీత్‌కు భారత్‌ వీసాను తిరస్కరించింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీ ట్రూడో ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తోంది. ఈ జగ్మీత్‌ సింగ్‌ ఖలిస్థానీ వేర్పాటువాదానికే పరిమితం కాలేదు.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపును కూడా వ్యతిరేకించాడు.

కెనడా ఏదో అనామక దేశమైతే భారత్‌కు పెద్ద ఇబ్బందికాదు.. కానీ, అది ప్రపంచంలోని సంపన్న దేశాల కూటమి అయిన జీ7 సభ్యదేశం. నాటోలో కూడా కెనడాకు సభ్యత్వం ఉంది. ఇలాంటి ప్రభావవంతమైన దేశంలోని ప్రభుత్వం ఖలిస్థానీ మద్దతుదారులతో నడుస్తుండటంతో భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.

భారత్‌-కెనడా మధ్య ముదిరిన ఖలిస్థానీ చిచ్చు.. మన రాయబారిపై ట్రూడో బహిష్కరణ వేటు

పెరిగిన దాడులు..

2019 తర్వాత నుంచి జగ్మీత్‌ సింగ్‌ బృందం ఖలిస్థాన్‌ విషయంలో మరింత చురుగ్గా పనిచేస్తోంది. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు, ప్రజలు, ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెరిగాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఇటీవల పలు ఘటనలు చోటు చేసుకొన్నాయి.

  • మార్చిలో లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయంపై దాడి జరిగింది. భారత పతాకాన్ని అవమానించారు. 
  • జూన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులు కార్యక్రమాలు చేపట్టారు. టొరొంటోలోని పంజాబీ పత్రిక సంజ్‌ సవేర.. ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ కవర్‌స్టోరీ రాసింది. దీన్ని భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఖండించారు. అంతేకాదు.. ఇవి ఓటు బ్యాంక్‌ రాజకీయాలని విమర్శించారు.
  • జులైలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివార్లలోని మేరీల్యాండ్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ విద్యార్థులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. 
  • సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ తరచూ కెనడాలో ఖలిస్థానీ రెఫరెండాలు నిర్వహిస్తోంది.
  • జులైలో భారత దౌత్యవేత్తలకు, సిబ్బందికి వ్యక్తిగతంగా హానీ చేస్తామంటూ ఖలిస్థానీలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ పరిస్థితిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. మొక్కుబడిగా భద్రత కల్పించి వదిలేసింది. గతంలో కూడా తరచూ ఖలిస్థానీ రెఫరెండాలకు కెనడా వేదికగా మారింది.

ఎవరీ నిజ్జర్‌

ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే వద్ద ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ను గురుద్వారాలో కాల్చిచంపారు. నిజ్జర్‌ పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని భార్‌ సింగ్‌ పుర గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నాడు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు వెనుక మాస్టర్‌ మైండ్‌ అతడే. దీనిని భారత్‌ నిషేధించింది. దీంతోపాటు సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌లో కూడా సభ్యుడు. 2020లో నిజ్జర్‌ను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది.  

  • 2007లో లూథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో నిజ్జర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గాయపడ్డారు. 
  • 2009లో పటియాలాలో రాష్ట్రీయ సిక్‌ సంగత్‌ అధ్యక్షుడు రూల్డా సింగ్‌ హత్యలో కూడా అతడి పాత్ర ఉంది.
  • గతేడాది ఓ హత్యకేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను పట్టించిన వారికి రూ. 10లక్షలు బహుమతి ప్రకటించింది. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడి వెనుక నిజ్జర్‌ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

భారత సైనిక, పోలీస్‌ సిబ్బందికి వీసా కష్టాలు..

భారత్‌ సైన్యం, పంజాబ్‌ పోలీస్‌లో పనిచేసి రిటైరైన సిబ్బంది ఎప్పుడైనా కెనడా వెళ్లాలంటే వీసాకు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని మాజీ దౌత్యవేత్త వివేక్‌ ఖట్జూ ఇటీవల వెల్లడించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి వీసాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. అంతేకాదు.. వీసా దరఖాస్తు చేసుకొంటే భద్రతా దళాల సిబ్బంది పనిచేసిన ఆపరేషన్లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని కెనడా అడుగుతోందన్న ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని