ukraine crisis: ఎందుకని పుతిన్‌కి ఇంత ఆరాటం...?

మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో నానాటికీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధాని కీవ్‌ నుంచి రష్యన్‌ బలగాలు వెనుదిరిగిన తరువాత వాటన్నింటిని తూర్పుతీర ప్రాంతమైన డాన్‌బాస్‌ను అధీనంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రధాని జెలెన్‌స్కీ అంటున్నారు.

Published : 20 Apr 2022 01:39 IST

ఉక్రెయిన్‌ తూర్పుతీర ప్రాంతంపై రష్యా ఆసక్తికి కారణాలు..

కీవ్‌: మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో నానాటికీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధాని కీవ్‌ నుంచి రష్యన్‌ బలగాలు వెనుదిరిగిన తరువాత వాటన్నింటిని తూర్పుతీర ప్రాంతమైన డాన్‌బాస్‌ను అధీనంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రధాని జెలెన్‌స్కీ వెల్లడించారు. అసలు ఈ డాన్‌బాస్‌ ప్రాంతంపై పుతిన్‌కు అంత  మక్కువ ఎందుకు...? ఇరు దేశాల వైఖరి ఎలా ఉంది..? భీకర పరిస్థితుల్లో కొనసాగుతున్న యుద్ధానికి తెరపడేనా...? లుహన్స్క్‌, డొనెట్స్క్‌ రెండు తూర్పూ తీర ప్రాంతాలను చేజిక్కించుకోవాలి అనుకోవడానికి గల కారణాలేమిటి అనే అంశాలను విశ్లేషిస్తే....
 

రష్యా వైఖరి..
రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్‌బాస్‌కు క్రిమియాకు మధ్యలో మేరియపోల్‌ ఉంది. ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంటే క్రిమియాకు, డాన్‌బాస్‌కు మధ్య ఎ రవాణాకు అడ్డంకులు ఉండవు. క్రిమియా నుంచి పోరాడుతున్న రష్యా సైన్యానికి, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ నుంచి పోరాడుతున్న ఉక్రెయిన్‌ సేనలను నిలువరించడానికి మరింత అవకాశం ఉంటుంది. అందుకే రాజధాని కీవ్‌ నుంచి వైదొలగిన రష్యన్‌ దళాలు  మేరియపోల్‌ను ఆక్రమించడానికి యత్నిస్తున్నాయి. దీన్ని ఆక్రమిస్తే ఉక్రెయిన్‌పై సగం విజయం సాధించినట్టే అని పుతిన్‌ భావిస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌కి రష్యాకు మధ్య వాణిజ్య వారధిలా పనిచేసే మేరియపోల్‌ను తమ అధీనంలోకి తీసుకుంటే స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని కొనసాగించవచ్చని పుతిన్‌ అభిప్రాయం. ఇప్పటికే రష్యన్‌సేనలు రెండు సార్లు విజయం సాధించినట్లు కూడా ప్రకటించుకున్నాయి. కానీ ఆ ప్రకటనలను ఉక్రెయిన్‌ కొట్టేపారేసింది. 
 

ఉక్రెయిన్‌ పోరాటం...
తమ దేశంలోని ఒక్క అడుగు భూభాగం కూడా రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. మేరియపోల్‌లో తమ సైనికులు పోరాడుతున్నారని. అక్కడ ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేశారు. త్వరలోనే రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించిన డాన్‌బాస్‌ను వెనక్కి తెచ్చుకోవడానికి తమ సైన్యాలు యత్నిస్తున్నాయని చెబుతున్నారు. 


అసలు డాన్‌బాస్‌లో ఏముంది...

అధ్యక్షుడు పుతిన్‌ ప్రకారం డాన్‌బాస్‌లో  బొగ్గు అధికంగా దొరుకుతుంది. మొక్కజొన్నలు ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రం. ఉక్కు కర్మాగారాలకు కేంద్రం. లుహాన్స్క్, దొనెట్స్క్‌ల సమ్మేళనంలో ఉన్న అతి పెద్ద వాణిజ్య కేంద్రం. అందుకే మేరియపోల్‌ను హస్తగతం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాలను అధీనంలోకి తీసుకొవచ్చనే కుటిల యత్నంలో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ కంటే రష్యన్‌ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కానీ వారు ఎవరూ రష్యాకు మద్ధతు ఇవ్వడంలేదన్నది వాస్తవం.
ఉక్రెయిన్‌ బలగాలు రష్యన్‌ సేనలను అడ్డుకోగలవా..?
యుద్ధం మొదటి దశలోనే పది బ్రిగేడ్ల సైన్యాన్ని జెలెన్‌స్కీ ఈ ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌ బలగాల బలం తెలియని అయోమయ పరిస్థితుల్లో రష్యా ఉన్నట్లు రష్య రక్షణ అధికారి సామీ కార్న్‌ చేబుతున్నారు. రష్యన్‌ సేనలను నిలువరించడానికి వ్యూహాలను ఉక్రెయిన్‌ రచిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుత యుద్ధరీతిని పరిశీలిస్తే  డాన్‌బాస్‌పై రష్యా ఆధిపత్యం సాధ్యం కాకపోవచ్చనని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని