Ukraine Crisis: ఉక్రెయిన్‌ నిఘా నుంచి తప్పించుకొనేందుకు రష్యా అవస్థలు

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి సమయంలో ఇంకా పాతకాలం నాటి ట్రిక్కులనే అనుసరిస్తున్నాయి. తాజాగా డ్రోన్లు..

Updated : 01 Apr 2022 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసే సమయంలో ఇంకా పాతకాలం నాటి పద్ధతులనే అనుసరిస్తున్నాయి. తాజాగా డ్రోన్లు.. మిలటరీ నిఘా ఉపగ్రహాలను తప్పించుకొనేందుకు వాహనాలపై ఆకులు, కొమ్మలు, గడ్డి వంటి వాటిని ఇంకా ఉపయోగిస్తున్నాయి. అత్యాధునిక సైన్యంగా చెప్పుకొనే రష్యా దళాలు ఇలాంటి ట్రిక్స్‌ వాడటంపై సైనిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాస్కో కమాండర్లు యుద్ధానికి ఏమాత్రం సన్నద్ధం కాలేదన్న అంశాన్ని ఈ విషయం చెబుతోందని పేర్కొన్నారు. 

ప్రత్యర్థుల దృష్టి నుంచి తప్పించుకోవడానికి కామోఫ్లాజ్‌ చేయడం యుద్ధంలో ప్రాథమిక అవసరం. సైనికుల దుస్తుల నుంచి బ్యాగ్‌లు, పరికరాలు కూడా అక్కడి ప్రకృతి రంగుల్లో కలిసిపోయేలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఇటీవల కాలంలో డ్రోన్లు, నిఘా ఉపగ్రహాలు, ఇన్‌ఫ్రారెడ్‌ స్కోప్స్‌ వచ్చాక.. ప్రత్యర్థుల దృష్టి నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. ఉష్ణ సంకేతాలను తగ్గించుకోవడం, ఆకారాలను మార్చుకోవడం ద్వారానే ఇది కొంతమేరకు సాధ్యమవుతుంది.

వాస్తవానికి 1990 నుంచి అమెరికా దళాలు అడవుల్లో, మంచు ప్రదేశాల్లో, ఏడారుల్లోని వాతావరణ రంగుల్లో కలిసిపోయేలా కామోఫ్లాజ్ల నెట్‌లను వాడుతున్నాయి. ఇటీవల కాలంలో వాటిని అప్‌గ్రేడ్‌ చేశాయి. రష్యా దళాలు మొదలుపెట్టిన పూర్తి స్థాయి యుద్ధంలో వాటి పరికరాల లభ్యత, యుద్ధసన్నద్ధత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. 

దీనికి తోడు రష్యా దళాలు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి. యుద్ధంలో వినియోగించాల్సిన అత్యంత గోప్యమైన ప్రత్యేక కమ్యూనికేషన్‌ లైన్లను పక్కన పెట్టి, అన్‌ సెక్యూర్డ్‌ కమ్యూనికేషన్‌ లైన్లను వినియోగిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్‌ సేనలు ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ట్రాక్‌ చేసి రష్యన్లపై దాడి చేస్తున్నాయి.

హీట్‌ సిగ్నేచర్‌ ఆధారంగా దాడి చేయగలిగే జావెలిన్‌ క్షిపణి నుంచి తప్పించుకొనేందుకు రష్యా దళాలు అవస్థలు పడుతున్నాయి. ఈ క్రమంలో హీట్‌ సిగ్నేచర్‌ను తగ్గించేందుకు కార్పెట్లు, ఇతర సరకులతో కప్పిపెడుతున్నాయి. ఇవన్నీ రష్యా దళాల సామర్థ్యాలను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. రష్యా తమ దేశ ప్రజలను బలవంతంగా మృత్యుముఖ్యంలోకి నెడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ విమర్శించారు. మార్చి 24 నాటికి దాదాపు 40వేల మంది రష్యా సైనికులు యుద్ధంలో గాయపడటమో, మరణించడమో, ప్రత్యర్థులకు దొరికిపోవడమో జరిగినట్లు నాటో దళాలు అంచనావేస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని