Ukraine Crisis: రష్యా ‘బ్లాక్‌’ ప్లాన్‌..!

అది పేరుకే నల్ల సముద్రం.. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. ఏనాడు ప్రశాంతంగా లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆధిపత్యపోరు జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఉక్రెయిన్‌పై యుద్ధ సమయంలో

Published : 11 May 2022 02:04 IST

 కీలక పోర్టులపై పట్టుకు మాస్కో తీవ్రయత్నాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అది పేరుకే నల్ల సముద్రం.. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. ఏనాడు ప్రశాంతంగా లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఉక్రెయిన్‌పై యుద్ధ సమయంలో రష్యా మూడు నౌకలు.. రెండు బోట్లు కోల్పోయినా.. దక్కించుకొన్న చిన్న ద్వీపం మింగుడు పడకపోయినా.. నల్ల సముద్రంపై పట్టు కోసం మాస్కో ఏమాత్రం తగ్గడంలేదు. అసలు ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో ఏమాత్రం సంబంధాలు లేకుండా చేయడమే లక్ష్యమని ఏప్రిల్‌లో ఓ రష్యా జనరల్‌ ప్రకటించారు. ఓ పక్క మేరియుపోల్‌ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోతుండగా.. మరో వైపు రేవు నగరం ఒడెస్సాపై దాడులు తీవ్రం చేసింది. 

తాజాగా ఏం జరిగింది..?

విక్టరీ డే సమయంలో ఉక్రెయిన్‌లోని పోర్టు నగరం ఒడెస్సాపై రష్యా ఏకంగా హైపర్‌ సొనిక్‌  క్షిపణులను ప్రయోగించింది. యుద్ధ విమానంపై నుంచి మొత్తం రెండు కింజల్‌ మిసైల్స్‌ను ప్రయోగించినట్లు తెలిసింది. ఈ దాడిలో రెండు హోటళ్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ పరిణామాలు మొత్తం ఉక్రెయిన్‌కు ఏమాత్రం సానుకూలంగా లేవు. ఈ పోర్టును కూడా ఉక్రెయిన్‌ మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. అదే జరిగితే ఉక్రెయిన్‌ జీవనాడి తెగినట్లే.

కీవ్‌కు నల్ల సముంద్రంతో రుణం తీరనుందా..?

ఒడెస్సాను ఆక్రమించి డాన్‌బాస్‌ ప్రాంతం నుంచి మాల్డోవాలోని రష్యా మద్దతుదారుల ఆధీనంలో ఉన్న ట్రాన్స్‌నిస్ట్రియా వరకు కారిడార్‌ ఏర్పాటు చేస్తామని ఓ సీనియర్‌ జనరల్‌ వెల్లడించినట్లు దిఎకనమిస్టు  కథనం వెలువరించిది. ఇదే జరిగితే ఉక్రెయిన్‌ నల్ల సముద్ర మార్గాన్ని మర్చిపోవాల్సిందే. ఆ దేశం ఎగుమతి చేసే 70 శాతం కార్గో ఈ మార్గం నుంచే వెళుతుంది. అదే సమయంలో ఈ మార్గంలో ప్రపంచ దేశాలకు రవాణా అయ్యే ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాలకు తీవ్ర  ఇబ్బందులు తలెత్తొచ్చు. ఇప్పటికే మేరియుపోల్‌ నగరంపై పట్టు సాధించడంతో అజోవ్‌ సముద్రంపై ఉక్రెయిన్‌ పట్టు దాదాపు తెగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు నల్ల సముద్రం నుంచి అట్లాంటిక్‌ను కలిపే ఐరోపాలోని రైన్‌-మెయిన్‌-డాన్‌బే కాల్వతో కూడా ఉక్రెయిన్‌ సంబంధాలు కట్‌ కానున్నాయి. 

అడ్డుకొనేందుకు టర్కీ తెరచాటు యత్నాలు..

రష్యా, ఉక్రెయిన్‌లు అజోవ్‌ సముద్రంపై అధికారం కలిగి ఉన్నాయి. ఈ సముద్రం నుంచి నల్ల సముద్రంలోకి కెర్చి జలసంధి ద్వారా ప్రవేశిస్తారు. బల్గేరియా, టర్కీ, రొమేనియా, మాల్డోవా, ఉక్రెయిన్‌, రష్యా, జార్జియా దేశాలు తమ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నల్ల సముద్ర మార్గంలోనే నిర్వహిస్తాయి. నల్ల సముద్రం బొస్పోరస్‌ జలసంధి ద్వారా మర్‌మర సముద్రంలో కలుస్తుంది. ఆ నౌకలు  డార్డనెల్లెస్‌ జలసంధి ద్వారా ఏజియన్‌ సముద్రంలోకి.. అక్కడి  నుంచి మధ్యధరా సముద్రానికి వెళతాయి. ఇవి జిబ్రాల్టర్‌ జలసంధిని దాటి అట్లాంటిక్‌ మహాసముద్రంలోకి వెళ్లి ఇతర ఖండాలతో వాణిజ్యం నెరుపుతాయి. బొస్పోరస్‌, డార్డనెల్లెస్‌ జలసంధులు టర్కీ ఆధీనంలో ఉంటాయి. నల్లముద్రంలోని దేశాల పౌర నౌకలు వీటిల్లోకి స్వేచ్ఛగా తిరిగేలా 1936లో మాంట్రీక్స్‌ ఒప్పందం జరిగింది. అదే సమయంలో ఈ దేశాల యుద్ధనౌకలపై కూడా చాలా స్వల్ప ఆంక్షలు ఉంటాయి. యుద్ధ సమయంలో వీటిని టర్కీ అడ్డుకోవచ్చు. విమాన వాహక నౌకలను మాత్రం ఎప్పుడూ అనుమతించరు. తాజాగా యుద్ధం మొదలైన తర్వాత టర్కీ మాంట్రీక్స్‌ ఒప్పందం ప్రకారం యుద్ధనౌకల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. రష్యా ఇతర ప్రాంతాల దళాల నుంచి అదనంగా నౌకలు వచ్చి చేరితే ఉక్రెయిన్‌లోని ఒడెస్సాపై దాడి తీవ్రమవుతుందని భావించే ఇలా చేసింది.

భారీగా మోహరించిన రష్యా బ్లాక్‌సీ దళం‌..!

బ్లాక్‌సీ ప్రాముఖ్యాన్ని రష్యా దాదాపు మూడు శతాబ్దాల క్రితమే గుర్తించింది. 1783లో బ్లాక్‌సీ దళాన్ని ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌ ఏర్పడిన తర్వాత కూడా బ్లాక్‌సీలోని క్రిమియా ద్వీపంలో ఉన్న సెవస్టపోల్‌ రేవును మాస్కో  తన ఆధీనంలో ఉండేలా కీవ్‌కు ఆఫర్లు ఇచ్చింది. 2014లో ఏకంగా క్రిమియాను ఈ దళమే స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం ఉన్న రష్యా బ్లాక్‌సీ దళంలో మొత్తం 20 వరకూ భారీ నౌకలు, సబ్‌మెరైన్లు ఉన్నాయి. మార్చిలో బెర్డియాన్స్క్‌ పోర్టు వద్ద సరటోవ్‌ అనే రష్యా నౌకను, మాస్కోవా యద్ధనౌకను, ఇటీవల ఒక ల్యాండింగ్‌ నౌకను, మరో రెండు పెట్రోల్‌ బోట్లను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. అయినా రష్యా దళాలు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. 

‘అడ్మిరల్‌ మకరోవ్‌’.. కెర్చ్‌ వంతెన ఇవే కీవ్‌ లక్ష్యాలా..!

మాస్కోవా యుద్ధనౌక మునక తర్వాత బ్లాక్‌సీ దళంలో రష్యా  భారీ యుద్ధనౌకల సంఖ్య మూడుకు పడిపోయింది. వీటిల్లో ఫ్రిగేట్‌ అడ్మిరల్‌ మకరోవ్‌ అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నెప్ట్యూన్‌ మిసైల్‌ బ్యాటరీలు , టీబీ-2 డ్రోన్లు దీనికోసం వేట సాగిస్తాయనడంలో అనుమానం లేదు. దీంతో ఉక్రెయిన్‌ క్షిపణులకు అందనంత దూరంలో దీనిని ఉంచుతున్నారు. ఫలితంగా రష్యా కూడా పూర్తి స్థాయిలో ఈనౌకను వాడుకోలేకపోతోంది. 4,000 టన్నుల బరువుండే ఈ నౌకలో 200 మంది సిబ్బంది ఉండొచ్చు.  24 బక్‌ మీడియం రేంజి క్షిపణులు, 8 కిల్బిర్‌ క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించగలదు. 

ఇక కెర్చ్‌ జలసంధిపై రష్యా- క్రిమియాను కలిపేలా మాస్కో 3 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కెర్చ్‌ రోడ్‌, రైలు వంతెనను నిర్మించింది. గతంలో పుతిన్‌ ఈ వంతెనపై స్వయంగా ట్రక్కు నడిపి చూశారు. ఇప్పటి వరకు రష్యా ఆయుధాలను క్రిమియాకు ఈమార్గంలోనే తరలించింది. కానీ రష్యా దీనిని కాపాడుకునేందుకు శత్రుదుర్భేద్యమైన  గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఈ ఉక్కువంతెనను కేవలం ఒక భారీ బాంబో.. క్షిపణితోనే కూల్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉక్రెయిన్‌ డ్రోన్లు అత్యధికంగా 400 పౌండ్ల బాంబును మాత్రమే  మోయగలవు. దీంతో ఈ వంతెనపై ఇప్పట్లో ఉక్రెయిన్‌ దాడి అసాధ్యంగానే కనిపిస్తోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts