Julian Assange: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం

Julian Assange: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి లభించింది. ఆయనకు ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించకుండా అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 26 Jun 2024 09:42 IST

వాషింగ్టన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు (Julian Assange) విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు.

అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అసాంజే (Julian Assange) అంగీకరించారు. మూడు గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్యాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లు వెల్లడించారు. భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. కానీ, అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ కేసును విచారించిన యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ చీఫ్‌ జడ్జి జస్టిస్‌ రమొనా వి.మంగ్లోనా.. అసాంజే (Julian Assange) నేరాంగీకారానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. యూకే, యూఎస్‌లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ఆయన కాన్‌బెర్రాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. యూఎస్‌కు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్‌లో ఉన్న కోర్టులో అసాంజే విచారణకు హాజరయ్యారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణ అక్కడ చేపట్టారు. పైగా ఆ భూభాగం ఆస్ట్రేలియా సమీపంలో ఉంటుంది.

అసాంజే (Julian Assange), అమెరికా న్యాయవిభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ స్వాగతించారు. ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేమని పేర్కొన్నారు. ఈ కేసులో ఓ సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. కేసు పూర్వాపరాలను పక్కనపెడితే.. విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు. అసాంజేను మరింతకాలం బందీగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు