Julian Assange: నేరాంగీకారానికి అసాంజే సిద్ధం.. అమెరికాతో ఒప్పందం!

Julian Assange: గూఢచర్యం ఆరోపణలతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (Julian Assange) కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి రాబోతోంది. అతడు నేరాంగీకారానికి సిద్ధమైనట్లు అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది.

Updated : 25 Jun 2024 09:50 IST

Julian Assange | వాషింగ్టన్‌: గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ (WikiLeaks) వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (Julian Assange) నేరాంగీకరణకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం కోర్టులో సమర్పించిన పత్రాలు వెల్లడించాయి. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలిక్కి రానుంది.

పశ్చిమ పసిఫిక్‌లోని యూఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్‌లోని ఫెడరల్ కోర్టులో అసాంజే (Julian Assange) హాజరుకానున్నట్లు పత్రాలు వెల్లడించాయి. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను అంగీకరించనున్నారని తెలిపాయి. దీన్ని న్యాయమూర్తి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయపోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది.

అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు (Julian Assange) అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్‌ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది.

యుద్ధాన్ని ఆపే ఏ ఒప్పందాన్నీ అంగీకరించం

నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్‌లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరుకానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించటంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది.

కేసు సాగిందిలా..

2006 - వికీలీక్స్‌ (WikiLeaks) స్థాపన

ఏప్రిల్‌ 2010 - హెలికాప్టర్‌ నుంచి చిత్రీకరించిన బగ్దాద్‌ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్‌ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు.

జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్‌ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి.

అక్టోబర్ 2010 - ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.

నవంబర్ 2010 - లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజేను అరెస్టు చేయాలని స్వీడిష్ కోర్టు ఆదేశించింది. వీటిని ఆయన ఖండించారు. యూరోపియన్ అరెస్ట్ వారెంట్‌పై మరుసటి నెలలోనే బ్రిటన్‌లో అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

ఫిబ్రవరి 2011 - లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలని ఆదేశించింది. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లారు.

జూన్ 2012 - బ్రిటీష్‌ సుప్రీంకోర్టు అసాంజే చివరి అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు.

ఏప్రిల్ 2019 - ఈక్వెడార్ ఆశ్రయం రద్దు. బ్రిటీష్‌ కోర్టు ఆయనకు మే 1 నుండి 50 వారాల జైలు శిక్ష విధించింది. శిక్షను పూర్తి చేసినప్పటికీ.. యూఎస్‌కు అప్పగించడానికి సంబంధించిన విచారణ పెండింగ్‌లో ఉండటంతో జైలులోనే ఉన్నారు.

జనవరి 2021 - మానసిక అనారోగ్య కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్‌ కోర్టు తేల్చింది.

డిసెంబర్ 2021 - అమెరికా హామీతో యూఎస్‌కు అప్పగించేందుకు మరో బ్రిటీష్‌ కోర్టు అంగీకారం.

మే 2024 - విచారణలో ఉన్న విదేశీ పౌరుడిగా, అమెరికా పౌరులకు వర్తించే వాక్ స్వాతంత్య్రంపై తాను ఆధారపడలేననే కారణంతో అప్పగింతకు వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లేందుకు లండన్‌ హైకోర్టు అసాంజేకు అనుమతినిచ్చింది.

జూన్ 2024 - అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్, అసాంజే మధ్య ఒప్పందం. అదనపు జైలు శిక్ష విధించబోమన్న షరతు కింద నేరాంగీకారానికి అసాంజే సమ్మతించినట్లు వెల్లడి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని