Monkeypox: కేరళలో మంకీపాక్స్‌ బాధితుడి మృతి.. భారత్‌లో తొలి మరణం..?

యూఏఈ (UAE) నుంచి భారత్‌ వచ్చిన యువకుడు (22) శనివారం మృతి చెందగా.. అతనికి పది రోజుల క్రితమే అక్కడ మంకీపాక్స్‌గా నిర్ధారణ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 31 Jul 2022 20:35 IST

యూఏఈలోనే పాజిటివ్‌గా నిర్ధారణ.. కేరళ అధికారులకు ఆలస్యంగా తెలిసిన వైనం

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్‌ (Monkeypox) అనుమానిత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కేరళలో మంకీపాక్స్‌ మరణం కలకలం రేపుతోంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి వచ్చిన యువకుడు (22) శనివారం మృతి చెందగా.. అతనికి పది రోజుల క్రితమే అక్కడ మంకీపాక్స్‌గా నిర్ధారణ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో అతడి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించిన కేరళ ఆరోగ్యశాఖ అధికారులు.. అతడి మృతికిగల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. దీన్ని దేశంలో తొలి మంకీపాక్స్‌ మరణంగా భావిస్తున్నారు.

కేరళలోని త్రిసూర్‌కి చెందిన ఓ యువకుడు (22).. జులై 21న యూఏఈ నుంచి భారత్‌కు చేరుకున్నాడు. అనంతరం జ్వరం, తలనొప్పితో ఎక్కువ కావడంతో జులై 27న ఆస్పత్రిలో చేరాడు. అతని శరీరంపై మంకీపాక్స్‌ లక్షణాలు లేకపోవడంతో ఆ దిశగా చికిత్స అందించలేదు. అయితే, శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలో జులై 19నే మంకీపాక్స్‌ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్‌కు బయలుదేరే ముందు వచ్చిన మంకీపాక్స్‌ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు. దానిని మరోసారి నిర్ధారించుకునేందుకు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మృతుడి నమూనాలను స్థానిక వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

టెస్టు ఫలితాన్ని చెప్పని యూఏఈ అధికారులు..?

యువకుడి మృతదేహాన్ని మంకీపాక్స్‌ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే ఖననం చేసిన అధికారులు.. అతడి ప్రైమరీ కాంటాక్టులను పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయంపై మాట్లాడిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌.. యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలేవీ కనిపించలేదన్నారు. ‘ఇది కొవిడ్‌ మాదిరి ప్రాణాంతకమైన వైరస్‌ కాదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మరణాల రేటు తక్కువే. అయినప్పటికీ ఆ యువకుడు మృతి చెందడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం’ అని వెల్లడించారు. దీంతోపాటు అతడికి మంకీపాక్స్‌ పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు తెలియజేయకపోవడంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతామని వీణా జార్జ్‌ అన్నారు.

ఇదిలాఉంటే, భారత్‌లో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదుకాగా అందులో మూడు కేరళలోనే ఉన్నాయి. మరోవైపు దేశంలో మంకీపాక్స్‌ బారినపడిన తొలి వ్యక్తి (32) పూర్తిగా కోలుకున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతోన్న అతడికి.. జులై 14న మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా తాజాగా అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆఫ్రికాలో ఇప్పటికే మూడు మరణాలు చోటుచేసుకోగా.. తాజాగా భారత్‌లో మంకీపాక్స్‌ తొలి మరణం సంభవించింది. స్పెయిన్‌లో రెండు, బ్రెజిల్‌లో ఒక మంకీపాక్స్‌ మరణం నమోదైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు