Russia: రష్యా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది..?

సైనిక సమీకరణతో భయాందోళనలకు గురవుతోన్న రష్యన్లు పొరుగు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 28 Sep 2022 01:29 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Ukraine Crisis) మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. సైనిక సమీకరణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైన్యంలో చేరాలంటూ పౌరులకు ఆదేశాలు వెళ్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురవుతోన్న రష్యన్లు సమీప దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలైన జార్జియా, ఫిన్లాండ్‌తోపాటు వీసా అవసరం లేని ఆర్మేనియా, టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలకు క్యూ కడుతున్నారు. సరిహద్దుల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న పుతిన్‌ ప్రభుత్వం.. ఏ క్షణమైనా సరిహద్దులను మూసివేసే ప్రకటన వెలువడవచ్చనే ఆందోళన రష్యన్లను వెంటాడుతోంది.

దేశం వీడుతోన్న లక్షల మంది రష్యన్లు..!

ఉక్రెయిన్‌పై దాడులను పెంచేందుకు గాను దాదాపు 3లక్షల సైన్యాన్ని సమీకరించాలని వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే, అధికారికంగా మూడు లక్షలని చెబుతున్నప్పటికీ సుమారు పది లక్షల మందిని క్రెమ్లిన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వీరిని ప్రధాన నగరాలైన మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి కాకుండా ఇతర నగరాల నుంచి సమీకరిస్తారనే వదంతులు మొదలయ్యాయి. దీంతో పొరుగు దేశాలకు తరలివెళ్లేందుకు రష్యన్లు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా జార్జియా, ఫిన్లాండ్‌ సరిహద్దుల్లో కార్లు, బస్సులు బారులు తీరుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు ఎంత మంది రష్యాను వీడారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ కేవలం జార్జియా సరిహద్దు నుంచే సుమారు లక్ష మంది దేశం విడిచినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

సరిహద్దులు మూసివేస్తారా..?

సైనిక సమీకరణ మొదలైనప్పటి నుంచి రష్యన్లు విదేశాలకు బారులు తీరడంపై క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పందించారు. ఈ వలసలను నివారించేందుకు సరిహద్దులను మూసివేసే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. ఈ విషయానికి సంబంధించి తనకు ఏమీ తెలియదన్నారు. సరిహద్దులు మూసివేయడంపై ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

జెట్‌ విమానాల్లో ఒక్కో సీటుకు రూ.20లక్షల ఛార్జి

త్వరలోనే దేశ సరిహద్దులు మూసివేస్తారని వార్తలు ఎక్కువైన నేపథ్యంలో సొంత వాహనాలను కాకుండా రష్యన్‌ పౌరులు విమానాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, 18 నుంచి 65 ఏళ్ల వయసువారిని విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చేసేదేమీ లేక రష్యన్లు ప్రైవేటు విమానాలను ఆశ్రయిస్తున్నారు. రష్యన్లకు వీసా లేకుండా ప్రయాణం చేసే వీలున్న అర్మేనియా, టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకోసం ఒక్కో సీటుకు 20 నుంచి 25వేల పౌండ్లను (సరాసరి రూ.20లక్షలు) వసూలు చేస్తుండగా.. అదే 8 సీట్ల జెట్‌ విమానానికి 80 వేల నుంచి 1.40వేల పౌండ్లను సంపన్నులు చెల్లిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ప్రైవేట్‌ జెట్‌లకు నిత్యం 50 అభ్యర్థనలు వస్తుండగా ప్రస్తుతం అది 5వేలకు చేరుకుందని ప్రైవేట్‌ జెట్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts