Taiwan-China: తైవాన్‌పై డ్రాగన్‌ ఉరుముతుందా..?

తైవాన్‌పై చైనా దాడి చేసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, జిన్‌పింగ్‌ అలాంటి చర్యకు దిగే అవకాశముండదని పలువురు విశ్లేషకులు తేల్చారు. ఎందుకంటే..

Published : 16 Jan 2024 14:03 IST

బీజింగ్‌: తైవాన్‌ ఎన్నికలు (Taiwan Elections) ముగిశాయి. చైనా (China) వ్యతిరేకిగా పేరొందిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించారు. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చైనా గట్టి హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్తులో తైవాన్‌పై డ్రాగన్‌ దాడి చేసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, చైనా అధినేత జిన్‌పింగ్‌ అలాంటి చర్యకు దిగే అవకాశముండదని పలువురు విశ్లేషకులు తేల్చారు. ఎందుకంటే..

 • చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. బీజింగ్‌కు అనుకూలమైన కొమింతాంగ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది.  బలవంతంగా విలీనం చేసుకుంటే తైవాన్‌ ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదముందని బీజింగ్‌ యోచిస్తోంది. దీంతో ఆచితూచి వ్యవహరించనుంది.
 • సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌ అగ్రగామిగా ఉంది. చైనా ఆర్థికశక్తికి సెమీ కండక్టర్లు చోదక శక్తిగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్‌పై బలప్రయోగం చేయడం.. డ్రాగన్‌ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది.
 • తైవాన్‌ నుంచి ఎక్కువగా ఎగుమతులు జరిగేది చైనాకే. ఈ ఉత్పత్తులను బీజింగ్‌ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంటుంది.
 • ఇప్పటికే బీజింగ్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దేశీయంగా రియల్‌ ఎస్టేట్‌రంగం ఒడుదొడుకుల్లో ఉంది. పొరుగు ద్వీపాన్ని ఆక్రమించుకునేందుకు యత్నాలు ప్రారంభిస్తే డ్రాగన్‌ ఆర్థికంగా తీవ్రనష్టం పాలయ్యే ప్రమాదముంది. ఇదే జరిగితే గత నాలుగు దశాబ్దాలుగా సాగించిన అనన్యమైన ప్రగతికి ప్రతిబంధకాలు తప్పవు.

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి విజయం

 • చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నది తైవాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలే. ఎలాంటి అలజడి ఏర్పడినా ఆ పెట్టుబడులు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చైనా సంయమనం పాటిస్తోంది.
 • లాయ్‌ విజయం సాధించినా.. ఆయన పార్టీకి వచ్చిన ఓట్లు 40 శాతం మాత్రమే. విపక్షాలకు వచ్చిన ఓట్లు 60 శాతం.
 • చైనాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక వేగం తగ్గడం.. తదితర అంశాలు జిన్‌పింగ్‌ను కలవరపెడుతున్నాయి. ఈ దశలో తైవాన్‌ విలీనానికి యత్నించే అవకాశాలు తక్కువ.
 • ఉక్రెయిన్‌పై రష్యా దాడి, గాజాపై ఇజ్రాయెల్‌ పోరాటం ఇప్పటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. తైవాన్‌పై దండయాత్రలో కూడా ఎలాంటి ముందడుగు పడకపోవచ్చన్న అనుమానం బీజింగ్‌లో ఉంది.
 • రష్యాకు చైనా నుంచి ఆయుధ సరఫరా జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. తైపేపై దాడికి దిగితే బీజింగ్‌కు ఆయుధాల కొరత సమస్య తలెత్తే ప్రమాదముంది.
 • తైవాన్‌తోపాటు అమెరికా నేతలు బీజింగ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనంగా ఉన్నారు. దీంతో భవిష్యత్తులో ఈ ద్వీపంపై డ్రాగన్‌ దాడి చేసే అవకాశాలు తక్కువే.
 • ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు తైవాన్‌ను గుర్తించలేదు. ఫలితంగా చైనాకు ఎలాంటి సమస్యలేదు కాబట్టి దూకుడుగా వ్యవహరించకపోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని