Cloth Mask: క్లాత్‌ మాస్క్‌ ధరిస్తున్నారా..! వైరస్‌ సోకే ప్రమాదం మీకు ఎంత ఉందంటే..?

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అటు ప్రభుత్వాలు.. ఇటు శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. నిజానికి

Published : 09 Jan 2022 01:57 IST

వేగవంతమైన ఒమిక్రాన్‌పై వీటి ప్రభావం తక్కువే అంటోన్న నిపుణులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అటు ప్రభుత్వాలు.. ఇటు శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. నిజానికి వైరస్ నుంచి రక్షణలో మాస్క్‌లు అత్యంత కీలకం అయినప్పటికీ.. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్‌ను ఒంటబట్టించుకున్నాయి. దీంతో రంగురంగుల, తిరిగి ఉపయోగించే క్లాత్‌ మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరి వీటిని ఉపయోగించడం ఎంతవరకూ ప్రయోజనకరం అంటే.. పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా సింగిల్‌ లేయర్‌ మాస్క్‌లను వాడకపోవడమే మేలని చెబుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మాస్క్‌ల వినియోగంపై అమెరికన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ గవర్నమెంటల్‌ ఇండస్ట్రియల్‌ హైజీనిస్ట్స్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పలు అధ్యయనాలు జరిపింది. వీటి ప్రకారం..

* ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ సోకుతుంది.

* ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 20 నిమిషాల్లో  సోకుతుంది. 

* ఇక, ఇద్దరూ క్లాత్‌ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్‌ వ్యాపిస్తుంది.

* ఒకవేళ ఇద్దరిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మాస్క్‌ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్‌ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్‌ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి సోకుతుంది. 

* అదే ఇద్దరిలో ఒకరు ఎన్‌95 మాస్క్‌ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్‌ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. 

* ఇద్దరూ ఎన్‌95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది. 

రెండు మాస్క్‌లు మేలు..

ఒక్కటే పొర(సింగిల్‌ లేయర్‌) ఉన్న క్లాత్ మాస్క్‌లు వైరస్‌లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ, చిన్న చిన్న ఏరోసెల్స్‌ను బ్లాక్‌ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది. అయితే ధ్రువీకరించిన ఎన్‌95 మాస్క్‌లు మాత్రం గాలిలోని 95శాతం అణువులను వడబోయగలవని పేర్కొంది. కానీ, చాలా మంది ఫ్యాషన్‌ కోసమో లేదా తిరిగి వినియోగించే వీలు ఉంటుందనో క్లాత్‌ మాస్క్‌లను వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు వాటిని సర్జికల్‌ మాస్క్‌లతో కలిపి ధరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగానీ, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోన్న ఈ సమయంలో కేవలం క్లాత్‌ మాస్క్‌ లేదా సర్జికల్ మాస్క్‌ ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.

అయితే కొంతమంది నిబంధనల కోసం మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు. అలాంటప్పుడు ఏ రకం మాస్క్‌ పెట్టుకున్నా ప్రయోజనం శూన్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ధరించే మాస్క్‌ తప్పకుండా ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని