Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!

కెనడాలోని సుషి రెస్టారెంట్‌లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్‌టాక్‌ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.

Published : 03 Jun 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తగా ఏదైనా తినాలనిపించినా, కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలన్నా, మిత్రులు కలిసినా మనకు వెంటనే రెస్టారెంట్‌(Restaurant) గుర్తుకు వస్తుంది. అందులో అడుగు పెట్టిన క్షణం నుంచి తిరిగి వచ్చేదాక రెస్టారెంట్‌ సిబ్బంది ఇచ్చే మర్యాద, పలకరింపులు మరింత ఆనందాన్నిస్తాయి. మెనూ (menu)ని చూసి నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తాం. కొన్నిసార్లు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్‌ చేయడం సహజం. కెనడాలోని సుషి రెస్టారెంట్‌లో ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్‌ చేసినందుకు ఆమె సిగ్గుపడాల్సి వచ్చింది.  

కాసాండ్రా మౌరో (Cassandra Mauro), సుషి రెస్టారెంట్‌ (Sushi Restaurant)లో ఎదురైన అనుభవాన్ని టిక్‌టాక్‌లో పంచుకున్నారు. తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి.. చికెన్ ఫ్రైడ్ రైస్, రొయ్యల వంటకం, నూడుల్స్‌తో పాటు రెండు సుషి రోల్స్ ఆర్డర్ చేశారు. అయితే అక్కడి సిబ్బంది చాలా ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేశారని భావించి వద్దు ఇక చాలు అని చెప్పారట. మేనేజర్ కూడా వాళ్ల టేబుల్ దగ్గరికి వెళ్లి బాగా ఆకలిగా ఉందా? అని అడిగారట. రెస్టారెంట్‌ వంటగదిలో ఉండే చెఫ్‌ కూడా చూసి నవ్వుతున్నట్లుగా ఆమెకు అనిపించిందని చెప్పింది. ‘మీ రెస్టారెంట్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అని ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలకు సుషి రెస్టారెంట్ స్పందిస్తూ.. ఈ రెస్టారెంట్ కొరియా నుంచి వచ్చిన ఓ చిన్న కుటుంబం నడుపుతున్న వ్యాపారం. చాలా మంది నమ్మకమైన కస్టమర్లతో నడుపుతున్నాము. మీకు కలిగిన చేదు అనుభవానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. భాష రాకపోవడంతో ఇలా జరిగింది. అంతేగాని, మిమ్మల్ని అవమానించే ఉద్దేశం కాదని క్షమాపణలు కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని