Mike Tyson: మైక్‌ టైసన్‌పై అత్యాచారం ఆరోపణలు : న్యూయార్క్‌ మహిళ దావా

ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson) తన పై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ న్యూయార్క్‌కు  చెందిన ఓ మహిళ కోర్టులో దావా వేసింది. అయితే, ఆ ఘటన 1990ల్లో జరిగిందని అందులో పేర్కొంది.

Published : 26 Jan 2023 01:33 IST

న్యూయార్క్‌: ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson) పై మరోసారి అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. 1990ల్లో తనపై టైసన్‌ అత్యాచారం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మహిళ న్యూయార్క్‌ న్యాయస్థానంలో దావా వేశారు. న్యూయార్క్‌ ఆల్బనీలోని ఓ నైట్‌ క్లబ్బులో మైక్‌ టైసన్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అప్పటి నుంచి కొన్నేళ్లపాటు తాను శారీరకంగా, మానసికంగా ఎంతగానో వేదనకు గురైనట్లు తెలిపారు. ఇందుకుగాను 5మిలియన్‌ డాలర్లు చెల్లించాలని దావాలో పేర్కొన్నారు. అయితే, 1990 మొదట్లో తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ మహిళ పేర్కొన్నప్పటికీ.. కచ్చితంగా ఏ రోజు ఆ ఘటన జరిగిందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

ప్రపంచ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌గా 1987 నుంచి 1990 వరకు కొనసాగిన మైక్‌ టైసన్‌ జీవితం రింగు బయట మాత్రం అల్లకల్లోలంగా ఉండేది. 1980 చివర్లో నటి రాబిన్‌ గీవెన్స్‌ను పెళ్లాడిన ఆయన కొద్దికాలానికే విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో టైసన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన గీవెన్స్‌.. వారి దాంపత్యం హింస, వినాశనంతో కొనసాగిందంటూ విడాకుల పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం  కొద్దికాలానికి ఇండియానాపొలిస్‌లో దేసిరీ వాషింగ్టన్‌ అనే మోడల్‌ మైక్‌ టైసన్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో 1992 ఫిబ్రవరి 10న మైక్‌ టైసన్‌ దోషిగా తేలడంతో మూడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని