Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!

డ్రాగన్ ఏక సంతానం విధానం(one-child policy ) వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ నిబంధన వల్ల తన తల్లి ఎంతగానో విలవిలలాడిందని తెలిపింది. 

Updated : 31 Mar 2023 19:42 IST

బీజింగ్‌: చైనా(China) చరిత్రను గమనిస్తే.. గుర్తొచ్చే వాటిలో ఏకసంతానం విధానం(single-child policy ) కూడా ఒకటి. దశాబ్దాలుగా కొనసాగిన ఈ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే .. ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. అలాగే మరో బిడ్డ ఉన్నవారు జరిమానా కట్టకపోతే.. ఆ సంతానాన్ని చట్టం ఉనికిలో లేకుండా చేయడం, వైద్య సేవలు, విద్యవంటి వాటిని అందకుండా చేసేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను వెనక్కి తీసుకున్నా.. దాని వల్ల కలిగిన మానసిక కలవరం అక్కడి తల్లుల మదిలో నుంచి చెరిగిపోలేదు. దీనికి సంబంధించి డాక్టర్ చెన్‌చెన్ ఝాంగ్‌ అనే యువతి తన తల్లి అనుభవించిన బాధను ట్విటర్‌లో షేర్ చేశారు. తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలను పోస్టు చేశారు. 

‘34 ఏళ్ల క్రితం మా అమ్మరాసిన డైరీలోని కొన్ని పేజీలివి. తన రెండు నెలల పసిబిడ్డను తన తల్లి(అమ్మమ్మ)వద్దకు పంపినప్పుడు కన్నీటితో రాసుకున్న పదాలివి. ఏక సంతానం నిబంధన కారణంగా తన బిడ్డను దూరంగా పంపాల్సి వచ్చింది. నేను ఓ బిడ్డకు తల్లయ్యేవరకు మా అమ్మకు కలిగిన గుండెకోత నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది చదివినప్పుడు కలిగిన బాధ నాకెప్పుడూ కలగలేదు. తన చిన్నారి వెళ్లిపోయే ముందు మరోసారి పాలుపట్టిన విషయాన్ని ఆ డైరీలో రాసుకుంది. అప్పుడు నా వయస్సు ఏడాదిన్నరే. కానీ ఆ ఉద్విగ్నభరిత వాతావరణంలో మా అమ్మతో నేను కూడా ఏడ్చేశానట. నా చెల్లికి ఐదారేళ్లు వచ్చిన తర్వాత మా వద్దకు వచ్చింది. కానీ రెండునెలల వయస్సులో తన బిడ్డను దూరం చేసుకున్నప్పుడు కలిగిన బాధ అమ్మకు ఎప్పటికీ ఉండిపోతుందని నాకు తెలుసు. కన్నీళ్లతో డైరీలో కొన్ని అక్షరాలు తడిసిపోయాయి. ఇలాంటి ఎన్నో మెలిపెట్టే గాథలున్న కుటుంబాల్లో మాదీ ఒకటి. ఏకసంతానం వల్ల కలిగిన వేదనను గుర్తుచేసుకోవడానికి ఒక మ్యూజియం ఉంటే.. అందులో మా అమ్మ డైరీని ఉంచుతాం’ అని చెన్‌చెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్లు చూసిన ఎంతోమంది తమ స్టోరీలు వెల్లడించారు. మరికొందరు ‘హార్ట్‌బ్రేకింగ్’అంటూ సందేశాలు పెట్టారు. 

దశాబ్దాలుగా ఏక సంతానం విధానాన్ని అమలు చేసిన చైనా 2016లో ‘ఇద్దరు బిడ్డలు ముద్దు’ అనే విధానానికి దిగివచ్చింది. 2020 జనగణన ప్రకారం చైనా జనాభా పెరుగుదల బాగా తగ్గిపోయిందని తేలడంతో గత ఏడాది ముగ్గురు పిల్లలు కనడానికి కూడా అనుమతించింది. పిల్లలను పెంచడానికి, వారిని చదివించడానికి డబ్బు ఖర్చు చేయాల్సి రావడంతో అక్కడ తల్లిదండ్రులు ఒకరిని మించి కనడానికి ఆసక్తి చూపడం లేదని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని