Taliban: మహిళా స్వేచ్ఛపై తాలిబన్ల ఉక్కుపాదం.. జిమ్‌లు, పార్కుల్లోకీ నో ఎంట్రీ!

తాలిబన్ల(taliban) కబంద హస్తాల్లో అఫ్గానిస్థాన్‌ మహిళలు నలిగిపోతున్నారు. అడుగడునా ఆంక్షలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Published : 11 Nov 2022 01:18 IST

కాబుల్‌: తాలిబన్ల(taliban) కబంధ హస్తాల్లో అఫ్గానిస్థాన్‌ మహిళలు నలిగిపోతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతోన్న తాలిబన్‌ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన తర్వాత 2021 ఆగస్టులో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగడుగునా మహిళలపై ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. మిడిల్‌ స్కూల్‌, హైస్కూల్‌ విద్యకు బాలికల్ని దూరం చేయడం.. అనేక రంగాల్లో మహిళల ఉద్యోగాలను పరిమితం చేయడం, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించడం వంటి అనేక కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా జిమ్‌లు, పార్కుల్లోకి మహిళలపై నిషేధం ఈ వారం నుంచి అమలులోకి వచ్చినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్‌ అకేబ్‌ మొహజెర్‌ వెల్లడించారు.

తాము అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా పార్కులు, వ్యాయామ శాలలు (జిమ్‌)ల్లోకి మహిళలపై నిషేధం విధించకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు ఆయన చెప్పారు. అందుకోసం వారంలో కొన్ని రోజులు మహిళలు, ఇంకొన్ని రోజులు పురుషులను పార్కులు, జిమ్‌లలోకి ప్రవేశం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు తామ ఆదేశాలను ఎవరూ పాటించడంలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో అన్ని పార్కులు, జిమ్‌లలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చాలాచోట్ల పార్కుల్లో మహిళలు, పురుషులు కలిసి ఉండటం తాము గమనించామని.. దురదృష్టవశాత్తు కొందరు మహిళలు హిజాబ్‌ కూడా ధరించడంలేదన్నారు. అందుకే అన్ని పార్కులు, జిమ్‌లలోకి మహిళలు ప్రవేశంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు తాలిబన్‌ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు, తాలిబన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆఫ్గానిస్థాన్‌లో మహిళలకు సంబంధించి ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఖండించారు. జనజీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసే ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ఆఫ్గానిస్థాన్‌లో మహిళలు, బాలికలకు అన్ని హక్కుల్ని కల్పించి వారి స్వేచ్ఛను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని