Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!

అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో అధికారం చేజిక్కి ఏడాది సమీపిస్తోన్న వేళ.. తాలిబన్లు(Talibans) మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబుల్‌(Kabul)లో...

Published : 14 Aug 2022 03:06 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో అధికారం చేజిక్కి ఏడాది సమీపిస్తోన్న వేళ.. తాలిబన్లు(Talibans) మరోసారి మహిళలపై విరుచుకుపడ్డారు. హక్కుల సాధనకు రాజధాని కాబుల్‌(Kabul)లో వారు చేపట్టిన ఓ నిరసన ర్యాలీని హింసాత్మకంగా అణచివేశారు. మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరపడంతోపాటు వెంబడించి మరీ వారిపై దాడులకూ పాల్పడినట్లు మీడియా కథనాలు తెలిపాయి. గతేడాది ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి మహిళల హక్కులను కాలరాస్తూ.. అంతకుముందు రెండు దశాబ్దాల్లో వారు సాధించిన ప్రగతిని అణగదొక్కుతోన్నారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే శనివారం దాదాపు 40 మంది మహిళలు ఉద్యోగ హక్కుతోపాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని విద్యాశాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ‘ఆగస్టు 15 బ్లాక్ డే’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని.. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఞానంతో విసిగిపోయాం.. న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్న కొంతమంది మహిళా నిరసనకారులను వెంబడించి.. దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడికి దిగారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నట్లు పలు నివేదికలు వెలువడుతున్నాయి. దేశంలో ఇప్పటికే వేల మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. మహిళలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించారు. దూర ప్రయాణం చేయాలనుకునే మహిళలకు.. తోడుగా దగ్గరి మగ బంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం కల్పించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తమ హక్కుల కోసం మహిళలు పలు సందర్భాల్లో గొంతును వినిపించినా.. ఆంక్షల పరంపర కొనసాగుతోంది. అనేక నెలల తర్వాత తాజాగా మరోసారి నిరసనకు దిగగా.. దాన్నీ అణచివేశారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని