Earthquake: 104 గంటలపాటు మృత్యువుతో పోరాటం.. చివరకు ఆమె సంకల్పమే గెలిచింది!

తుర్కియే (Turkey)లోని కిరిఖాన్‌ (Kirikhan) నగంరలో భూకంప (Earthquake) ధాటికి కూలిపోయిన ఓ భవనం శిథిలాల కింద ఉండిపోయిన ఓ మహిళను సహాయక బృందాలు సురక్షితంగా బటయకు తీశాయి. ఆమెను చూసి వారంతా అద్భుతం జరిగిందని అంటున్నారు.

Published : 10 Feb 2023 22:16 IST

కిరిఖాన్‌: ఊపిరి సరిగా అందడం లేదు.. పైకి లేద్దామంటే మీద బరువైన వస్తువు.. చుట్టూ చూస్తే చీకటి.. బాధను పంటిబిగువన భరిస్తూ ఎంతసేపు ఉండాలో తెలియదు.. అసలు ప్రాణాలతో బతికి బయటపడతామా లేదా అని సందేహం.. క్షణక్షణం గడిచేకొద్దీ బాధ ఎక్కువవుతోంది. ఎవరైనా వచ్చి సాయం అందిస్తే బావుణ్ను అనుకుంటుంటే.. చుట్టుపక్కల ఏదో అలికిడి. ఏవో మెషీన్ల శబ్దాలు. అంతలోనే చుట్టూ ఉన్న చీకటి మెల్లగా తొలగి వెలుగు కనిపించడం ప్రారంభమైంది. తర్వాత కొన్నిచేతులు.. తనపై పడిన బరువైన వస్తువును తొలగించాయి..  ఇదీ 104 గంటలపాటు శిథిలాల కింది ఉండిపోయిన 40 ఏళ్ల  జైనెప్ కహ్రామాన్‌ (Zeynep Kahraman) అనే మహిళ భయానక అనుభవం. 

భూకంప ధాటికి తుర్కియా (Turkey)లోని కిరిఖాన్‌ (Kirikhan) నగంలోని ఓ భవనం శిథిలాల కింద సుమారు 104 గంటలపాటు ఉండిపోయిన జైనెప్ కహ్రామాన్‌ను ఇంటర్నేషనల్‌ సెర్చ్‌ అండ్ రెస్క్యూ టీమ్‌ (ISAR) సురక్షితంగా కాపాడింది. అంతసేపు ఆమె ప్రాణాలతో ఉండటం చూసి.. ఆమెను కాపాడిన సహాయక బృందం అద్భుతం జరిగిందని అంటున్నారు. ‘‘ఇప్పటి దాకా అద్భుతాలు జరుగుతాయంటే నమ్మేవాణ్ని కాదు.. ఇకపై నమ్ముతాను’’ అని అన్నారు ఐఎస్‌ఏఆర్‌ బృందానికి నాయకత్వం వహించిన స్టీవెన్‌ బేయర్‌. జర్మనీకి చెందిన ఆయన ప్రస్తుతం తుర్కియేలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భూకంపం శిథిలాల కింద 104 గంటలపాటు ఉండిపోయిన జైనెప్‌ కహ్రామాన్‌ను సురక్షితంగా కాపాడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బతకాలన్న ఆమె సంకల్పం ముందు మరణం సైతం చిన్నబోయిందని ఆమెను కనిపెట్టిన రెస్యూ కుక్కను నడిపించే తమరా రీథర్‌ అన్నారు.  ప్రస్తుతం  జైనెప్‌ కహ్రామాన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

ప్రకృతి విలయంతో కకావికలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలోనే సహాయక సిబ్బంది కాపాడిన వారిలో కొందరు ప్రాణాలతో బయటపడుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని