Updated : 21 May 2022 12:49 IST

మాపై అత్యాచారాలు ఆపండి.. కేన్స్‌లో దుస్తులు చించుకుని మహిళ ఆందోళన

కేన్స్‌: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తోన్న అకృత్యాలను నిరసిస్తూ ఓ మహిళ కేన్స్‌లో ఆందోళనకు దిగింది. రెడ్‌ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం ‘త్రి థౌజెండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ లాంగింగ్‌’’ సినిమా ప్రీమియర్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎర్ర తివాచీపై నిలబడి ఫొటోలకు పోజులిస్తుండగా.. ఉన్నట్టుండి ఓ మహిళ అక్కడకు వచ్చింది. రెడ్‌ కార్పెట్‌ ఉన్న మెట్లపైకి వచ్చి తన దుస్తులను చించేసుకుంది. ఆమె ఛాతీ భాగంపై ‘‘Stop raping us” అనే సందేశం ఉక్రెయిన్‌ జెండా రంగులైన నీలం, పసుపు రంగు పెయింట్‌లో కనిపించింది. ‘‘మమ్మల్ని రేప్‌ చేయొద్దు’’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెకు దుస్తులు కప్పి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేన్స్‌ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. సదరు మహిళ ఎవరన్నది కూడా తెలియరాలేదు. ఉక్రెయిన్‌ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత అక్కడి మహిళలపై క్రెమ్లిన్‌ సేనలు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలపైనా ఈ దారుణాలు జరుగుతుండటం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది. వీటిపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని ఆ మధ్య ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

ఇటీవల కేన్స్‌ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జెలెన్‌స్కీ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌కు అండగా సినీ ప్రపంచం నిలవాలని అభ్యర్థించారు. ‘‘మా దేశంపై రష్యా జరుపుతోన్న దాడుల్లో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా? లేదా మాట్లాడుతుందా? ఓ నియంత యుద్ధం మొదలుపెడితే.. స్వేచ్ఛ కోసం ఓ పోరాటం జరుగుతుంటే.. ప్రపంచమంతా ఏకమవ్వాలి. ఈ ఐకమత్యానికి సినిమా దూరంగా ఉంటుందా? రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఛార్లీ చాప్లిన్‌ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’.. ప్రస్తుత ఉక్రెయిన్‌ పరిస్థితులకు భిన్నంగా ఏం లేదు. చాప్లిన్‌ డిక్టేటర్‌.. నిజమైన నియంతను నాశనం చేయలేకపోవచ్చు. కానీ అలాంటి దారుణాల పట్ల సినీ ప్రపంచం మౌనంగా ఉండదని మాత్రం ఆ చిత్రం చాటిచెప్పింది. ఇప్పుడు కూడా సినీ ప్రపంచం నిశ్శబ్దంగా ఉండబోదని రుజువు చేసేందుకు మనకు కొత్త చాప్లిన్‌ అవసరం’’ అని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని