Ukraine Crisis: ఆంక్షలతో జరిగేదేంలేదు.. సైనిక చర్య ఆగదన్న రష్యా

అమెరికా సహా దాని మిత్రపక్షాలు విధిస్తున్న ఆంక్షలను రష్యా ఎద్దేవా చేసింది. వాటిని అద్భుతమైన ఆంక్షలంటూ వ్యంగ్యంగా స్పందించింది......

Published : 27 Feb 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడటంతో ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశాన్ని రష్యా ఎద్దేవా చేసింది. వాటిని అద్భుతమైన ఆంక్షలంటూ వ్యంగ్యంగా స్పందించింది. అమెరికా సహా దాని మిత్రపక్షాలు రష్యాపై విధించిన ‘అద్భుతమైన’ ఆంక్షలతో ఎలాంటి మార్పూ ఉండబోదన్న రష్యా.. ఉక్రెయిన్​లోని డొన్​బాస్​ ప్రాంతాన్ని రక్షించే మిలిటరీ ఆపరేషన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఈ సైనిక చర్య ఆగదని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్​ దిమిత్రి మెద్వెదెవ్​ పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖలోని వారికి కూడా ఇది స్పష్టంగా తెలుసని ఆయన అన్నారు. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ సహా ఇతర ప్రాంతాలపై రష్యన్​ బలగాలు దాడులను ముమ్మరం చేసిన వేళ ఈ ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ అతలాకుతలం అవుతోంది. రష్యా సైన్యాలు పెద్దఎత్తున క్షిపణులు, శతఘ్నులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేలాదిమంది ఉక్రెనియన్లు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమ దేశానికి లక్షకుపైగా ఉక్రెయిన్‌ వాసులు తరలివచ్చినట్లు పోలాండ్‌ తెలిపింది. రష్యా దాడి అనంతరం ఉక్రెయిన్‌ నుంచి లక్షమంది పౌరులు సరిహద్దు దాటి పోలాండ్‌లోకి ప్రవేశించారని ఆ దేశ ఉప అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి పావెల్ స్జెఫెర్నేకర్ శనివారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని