Putin: పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌

అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

Updated : 17 Mar 2023 21:46 IST

ది హేగ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలిపింది. ‘‘ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం అంతేకాకుండా ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం తదితర నేరాలకు పుతిన్‌ బాధ్యుడు’’ అందుకే ఆయన్ని అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేశాం అని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా  రష్యా బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవా బెలోవాకు కూడా అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లోని చిన్నారులను రష్యాకు చట్టవిరుద్ధంగా రవాణా చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ప్రతి అనుమానితుడు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఐసీసీ ప్రీ ట్రయల్‌ ఛాంబర్‌ అభిప్రాయపడింది.

ఐసీసీ అరెస్ట్‌ వారెంట్ జారీ చేయడంపై రష్యా స్పందించింది. ఇదంతా అర్థం లేని వ్యవహారమని వ్యాఖ్యానించింది. ‘‘ ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంలో అర్థం లేదు.చట్టబద్ధంగానూ ఇది సరికాదు.’’అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తుందన్న వార్తలు నిన్ననే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురవారమే ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఐసీసీకి అరెస్టు వారెంట్‌ జారీ చేయడం తప్ప.. నిందితులను అరెస్టు చేసే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. కోర్టు ఏర్పాటు చేసినప్పుడు ఏయే దేశాలు సంతకాలు చేశాయో వాటికి సంబంధించిన వివాదాల్లో మాత్రమే జోక్యం చేసుకునే అధికారం ఐసీసీకి ఉంటుందని చెప్పారు. సంతకం చేసిన దేశాల్లో రష్యా లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు