Dirtiest Man: 60ఏళ్లుగా స్నానానికి దూరం.. ప్రపంచంలోనే అత్యంత ‘మురికి వ్యక్తి’ మృతి

ఇరాన్‌కు చెందిన ఓ వృద్ధుడు (94) అరవై ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉంటున్నాడు. దాంతో ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా పేరుగాంచాడు. అటువంటి వింత వ్యక్తి ఇటీవలే కన్నుమూసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Updated : 26 Oct 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌కు చెందిన ఓ వృద్ధుడు (94) ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా పేరు గాంచాడు. అరవై ఏళ్లలో ఆయన ఒక్కసారి కూడా స్నానం చేయలేదట. అటువంటి వింత వ్యక్తి ఇటీవలే స్నానం చేశాడు. సుమారు ఆరు దశాబ్దాలుగా స్నానానికి దూరంగా ఉన్న అతడు మృతి చెందినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

అమౌ హజీ అనే వ్యక్తి ఇరాన్‌లోని ఫార్స్‌ ప్రావిన్సులోని డెజ్‌గా గ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. ఆయన కుటుంబీకులు ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్థులే చిన్న నివాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయనకు స్నానమంటే అసహ్యం. కనీసం సబ్బుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న దాఖలాలూ లేవట. రోడ్డుపైన చనిపోయిన మూగజీవాలను తినడంతోపాటు నాలుగైదు సిగరెట్లనూ  ఒకేసారి పీల్చేవాడట. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారిన పడతాననే అపోహతోనే ఆ వృద్ధుడు అరవై ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉండిపోయాడట.

ఇలా వింత జీవితాన్ని గడుపుతోన్న ఆ వృద్ధుడిపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అటువంటి వ్యక్తికి గ్రామస్థులందరూ కలిసి ఇటీవల బలవంతంగా స్నానం చేయించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే (అక్టోబర్‌ 23న) ఆ వృద్ధుడు కన్నుమూయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని