Modi: హిరోషిమా పేరు వింటేనే.. ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుంది: మోదీ

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(Modi) ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. హిరోషిమా(Hiroshima) పట్టణంలో జరుగుతోన్న జీ7 సదస్సు కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Updated : 20 May 2023 14:19 IST

హిరోషిమా: ఇప్పటికీ హిరోషిమా(Hiroshima) పేరు వింటే ప్రపంచం వణికిపోతుందని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. ప్రస్తుతం జీ7 సదస్సు(G7 summit)లో భాగంగా జపాన్‌లో పర్యటిస్తోన్న ఆయన.. శనివారం హిరోషిమా పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ(Modi) శుక్రవారం జపాన్‌(Japan) వెళ్లారు. హిరోషిమా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. పొరుగుదేశాలతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా ఈ రోజు ఆ పట్టణంలోని మొటొయాసు నది సమీపంలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అణుబాంబు దాడి కారణంగా మృత్యువాతపడ్డ వేలమంది జ్ఞాపకార్థం నిర్మించిన శాంతివనానికి దగ్గర్లో దీనిని ఏర్పాటు చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..‘హిరోషిమా(Hiroshima) పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుంది. జీ7 సదస్సు కోసం వచ్చిన సందర్భంగా  గాంధీ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు జపాన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’అని అన్నారు.  

ఇదీ చదవండి: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!

ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిపై విజయం సాధించేందుకు గాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు మహాత్ముడి సిద్ధాంతమైన అహింసను ముందుకు తీసుకెళ్తుందన్నారు. ‘నేను జపాన్‌ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని ఇక్కడ నాటారని తెలిసింది. అది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఇక్కడకు వచ్చిన ప్రజలు.. వీటన్నింటి ద్వారా శాంతి ఆవశ్యకతను అర్థం చేసుకుంటారు’ అంటూ గాంధీకి నివాళి అర్పించారు. ఈ విగ్రహాన్ని పద్మభూషణ్ గ్రహీత అయిన రామ్ వాంజీ సుతర్‌ రూపొందించారు. ఈ కార్యక్రమం తర్వాత హిరోషిమా(Hiroshima)లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీVolodymyr Zelensky).. ప్రధాని మోదీతో అక్కడ శనివారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ఈ ఇరువురు నేతలు నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి కానుంది. ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి అణుభయాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అణుభూమి హిరోషిమా(Hiroshima)లో జీ7 సదస్సు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని