WHO Vs Musk: మస్క్‌ X టెడ్రోస్.. ట్విటర్ వార్‌..!

భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో కొత్త ఒప్పందం కోసం జరుగుతోన్న చర్చలు ట్విటర్ వార్‌కు దారితీసింది. మస్క్(Elon Musk) చేసిన ట్వీట్‌పై టెడ్రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Published : 24 Mar 2023 11:50 IST

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత, ట్విటర్ బాస్ ఎలాన్‌ మస్క్(Elon Musk) మధ్య ట్వీట్ల వార్ జరిగింది. భవిష్యత్తు మహమ్మారులను నిరోధించడం, వాటి విషయంలో వేగంగా స్పందించే ఉద్దేశంతో కొత్త ఒప్పందం దిశగా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మస్క్‌ చేసిన ట్వీట్‌ టెడ్రోస్ అధనామ్(Tedros Adhanom) ఆగ్రహానికి దారితీసింది. 

ఈ కొత్త ఒప్పందం చర్చలను ఉద్దేశించి మస్క్(Elon Musk) స్పందిస్తూ.. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. దానికి టెడ్రోస్(Tedros Adhanom) ఘాటుగా బదులిస్తూ.. నకిలీ వార్తల పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించడం లేదు. మమ్మారులకు సంబంధించి చేసుకునే ఒప్పందం దానిని మార్చదు. కేవలం మహమ్మారులను మెరుగ్గా అడ్డుకోవడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుంది. ప్రజలు పేద లేక ధనిక దేశంలో నివసిస్తున్నారా..? అనే దానితో సంబంధం లేకుండా వారిని రక్షించేందుకు ఇది సాయపడుతుంది’ అంటూ సమాధానమిచ్చారు. మస్క్‌ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. అలాగే తమ దేశ చట్టాలను అనుసరించి అవి ఈ ఒప్పందాన్ని అమలు చేసుకుంటాయని చెప్పారు. 

మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కరోనా(coronavirus) వణికించింది. ఆ వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే కరోనా ప్రారంభ సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే విషయంలో ఆసల్యం, సమాచార బదిలీ తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహమ్మారులు సంభవించినప్పుడు వేగంగా సమాచార బదిలీకి, వ్యాక్సిన్ల పంపిణీలో ఉన్న అసమానతలను తొలగించేలా ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని