World War II: ఓ సైనికుడి లేఖ.. 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక!

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో జర్మనీలో ఉన్న ఓ అమెరికా సైనికుడు తన తల్లికి రాసిన లేఖ ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోవడం గమనార్హం. ఇందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 ఏళ్లు పట్టింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్‌ వోబర్న్‌కు చెందిన...

Published : 08 Jan 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో జర్మనీలో ఉన్న ఓ అమెరికా సైనికుడు తన తల్లికి రాసిన లేఖ ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోవడం గమనార్హం. ఇందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 ఏళ్లు పట్టింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్‌ వోబర్న్‌కు చెందిన జాన్‌ గోన్సాల్వ్స్.. దేశ సైన్యం తరఫున 1945 డిసెంబర్‌లో జర్మనీలో విధుల్లో ఉన్నాడు. అప్పుడతని వయస్సు 22. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. ఆ సమయంలో అతను తన తల్లికి ఓ లేఖ రాశాడు.

‘డియర్‌ మామ్‌. ఈ రోజు మీ నుంచి మరొక లేఖ వచ్చింది. అక్కడ అంతా క్షేమమేనని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. నా విషయానికొస్తే, ఇక్కడ బాగానే ఉన్నా. కానీ, ఆహారమే.. చాలావరకు బాగుండటం లేదు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా- మీ కుమారుడు జానీ’ అని అందులో రాసి ఉంది. కానీ, అప్పుడది ఇంటికి చేరలేదు. తాజాగా పిట్స్‌బర్గ్‌లోని యూఎస్ పోస్టల్ సర్వీస్(యూఎస్‌పీఎస్‌) డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీలో బయటపడింది. దశాబ్దాలుగా తెరవకుండా అలాగే ఉన్న ఆ లేఖను.. పోస్టల్‌ సిబ్బంది ఇటీవల అతని భార్య ఏంజెలీనా(89) చిరునామా కనుక్కొని పంపారు.

‘ఈ లేఖను చేరవేయడం చాలా ముఖ్యం’ అంటూ పోస్టల్‌ సిబ్బంది.. తమ సొంత లేఖనూ దాంతో జతచేశారు. ఎట్టకేలకు ఉత్తరాన్ని అందుకున్న అతని కుటుంబం.. పోస్టల్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉండగా.. గోన్సాల్వ్స్ 2015లో మరణించగా, అతని తల్లి కూడా అప్పటికే కన్నుమూశారు. తాజాగా ఈ లేఖ అందుకున్న భార్య మాత్రం.. ‘ఒక్కసారి ఊహించుకోండి! ఏకంగా 76 ఏళ్లు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నమ్మలేకపోయా. కానీ.. ఇది అతని చేతి రాతే. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ‘అతనే నా వద్దకు తిరిగి వచ్చినట్లు ఉంది.. తెలుసా?’ అని ఉద్విగ్నులయ్యారు. జాన్‌ ఈ ఉత్తరం పంపిన ఐదేళ్లకు ఆమె పరిచయమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని