Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్‌.. ప్రయాణం కూడా సాహసమే!

బ్రిటన్‌లోని ‘ది డీప్‌ స్లీప్‌ హోటల్‌’కు ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్‌గా పేరుంది. భూఉపరితలానికి దాదాపు 400 మీటర్లకు (1375 అడుగులు)పైగా లోతులో ఉందిదీ.

Published : 08 Jun 2023 14:30 IST

లండన్‌: ప్రపంచంలో అనేక హోటళ్లు వాటికవే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో బ్రిటన్‌ (Britain)లోని ‘ది డీప్‌ స్లీప్‌ హోటల్‌ (Deep Sleep Hotel)’ ఒకటి. భూగర్భంలో ఏర్పాటు చేసిన దీనికి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన హోటల్‌ (World's Deepest Hotel)గా గుర్తింపు ఉంది. దీన్ని చేరుకునేందుకు ఓ సాహస యాత్రే చేయాల్సి ఉంటుంది. బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్‌ చేస్తూ.. అనేక పురాతన వంతెనలు, మెట్ల బావులు దాటుకుంటూ.. కఠిన దారుల్లో గంటకుపైగా నడక సాగించాల్సిందే.

బ్రిటన్‌ నార్త్‌ వేల్స్‌లోని ఎరారీ నేషనల్‌ పార్క్‌లో పర్వతాల కింద ఈ హోటల్‌ను నిర్మించారు. భూఉపరితలానికి దాదాపు 400 మీటర్లకు (1375 అడుగులు)పైగా లోతులో ఉంది. డీప్ స్లీప్ హోటల్‌లో రెండు పడకలతోకూడిన నాలుగు ప్రైవేటు క్యాబిన్‌లు, డబుల్ బెడ్‌తో కూడిన ఒక ప్రత్యేక గుహను గదివలే తీర్చిదిద్దారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అద్దెకు తీసుకోవచ్చు. ప్రైవేటు క్యాబిన్‌లో ఇద్దరి బసకు 350 పౌండ్లు (రూ.36 వేలు), గుహ గదికిగానూ 550 పౌండ్లు (రూ.56 వేలు) చెల్లించాలి.

ఈ హోటల్‌లో బస చేయాలనుకునేవారు ముందుగా ట్రిప్ లీడర్‌ వెంట పాడుబడిన విక్టోరియన్ బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్ చేయాలి. మెట్ల బావులు, పాత వంతెనలు దాటుకుంటూ.. కఠిన మార్గాల్లో గంటపాటు ప్రయాణించాలి. చివరకు ఒక పెద్ద ఉక్కు తలుపు.. ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. ప్రయాణ మార్గంలో అతిథులకు హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులు సమకూరుస్తారు. ఈ హోటల్‌లో గడిపినవారు తమ జీవితంలోనే మంచి నిద్రను పొందామంటూ చెబుతున్నారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని