Hawaii: శాంతించని ‘మౌనా లోవా’.. ఎగసిపడుతోన్న లావా!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా(Mauna Loa)’.. భీకరంగా మారుతోంది. క్రమంగా పెద్దఎత్తున లావా వెల్లగక్కుతోంది. రెండుమూడు చోట్ల నుంచి ఫౌంటెయిన్ల మాదిరిగా.. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావా ఎగజిమ్ముతోండటం గమనార్హం.

Published : 04 Dec 2022 01:04 IST

హానలులు: ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా(Mauna Loa)’.. భీకరంగా మారుతోంది. క్రమంగా పెద్దఎత్తున లావా వెల్లగక్కుతోంది. రెండుమూడు చోట్ల నుంచి ఫౌంటెయిన్ల మాదిరిగా.. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావా ఎగజిమ్ముతోండటం గమనార్హం. పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి(Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం.. గత నెల 27 నుంచి విస్ఫోటం చెందుతోన్న విషయం తెలిసిందే. దీంతో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలు.. ఎర్రటి లావా ప్రవాహాలు, బూడిద, పొగతో నిండిపోయాయి. 1984 తర్వాత దీన్నుంచి లావా వెలువడటం ఇదే మొదటిసారి. అమెరికా జియాలజికల్‌ సర్వే ప్రకారం.. 1843 నుంచి ఇప్పటివరకు ఇది 33 సార్లు పేలింది.

ప్రధాన లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల(60 మీటర్లు) వేగంతో ఈశాన్య దిశలో ముందుకు సాగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం హవాయిలోని ప్రధాన రహదారి ‘సాడిల్ రోడ్’కు 4.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. ‘మౌనా లోవా’ విస్ఫోటం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1984లో పేలినప్పుడు.. దాదాపు మూడు వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగినట్లు హవాయి అగ్నిపర్వతాల అబ్జర్వేటరికి చెందిన డేవిడ్ ఫిలిప్స్ వెల్లడించారు. ప్రస్తుత లావా ప్రవాహం కూడా అప్పటిమాదిరిగానే ఉందని అబ్జర్వేటరి శాస్త్రవేత్త కెన్‌ హన్‌హన్ తెలిపారు. మరోవైపు..  ఈ అగ్నిపర్వతాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని