China: కంచెలు దూకిన ఘటన.. ఉన్నవారికి నాలుగింతలు బోనస్‌..!

ఫాక్స్‌కాన్‌ సంస్థలో ఐఫోన్‌ 14 సహా యాపిల్ ఉత్పత్తులను అసెంబుల్ చేస్తారు. అయితే అక్కడ కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్టోబర్ మధ్య నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Updated : 01 Nov 2022 14:41 IST

బీజింగ్: కరోనా ఆంక్షల చట్రంలో ఇమడలేక చైనాలోని అతిపెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం నుంచి సిబ్బంది కంచెలు దూకి పారిపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై విచాట్‌లో జెంగ్‌ఝౌలోని ఫాక్స్‌కాన్ సంస్థ మంగళవారం స్పందించింది. సంస్థలో ఉండి విధులు నిర్వహించే వారికి బోనస్ నాలుగింతలు అదనంగా ఇస్తామని వెల్లడించింది.

‘ఈ మంగళవారం నుంచి ఇక్కడ ఉండి విధులు నిర్వహించేవారు రోజువారీ బోనస్‌ 400 యువాన్లు(55 డాలర్లు) అందుకుంటారు. అంతకుముందు ఇది 100 యువాన్లుగా ఉండేది. అలాగే నవంబర్‌ నెలలో 15 అంతకంటే ఎక్కువ రోజులు ఆఫీస్‌కు వస్తే.. ఉద్యోగులు అదనపు బోనస్‌ పొందుతారు. అదే నెలలో అన్ని రోజులు వస్తే.. ఆ మొత్తం 15 వేల యువాన్ల వరకు చేరుకుంటుంది’ అని వెల్లడించింది. అలాగే కంచెలు దూకిన ఘటనలు వెలుగులోకి రావడంతో సిబ్బందికి బస్సులు ఏర్పాటు చేయడానికి సంస్థ ముందుకు వచ్చింది. 

ఫాక్స్‌కాన్‌ సంస్థలో ఐఫోన్‌ 14 సహా యాపిల్ ఉత్పత్తులను అసెంబుల్ చేస్తారు. అయితే అక్కడ కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్టోబర్ మధ్య నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైరస్ బారినపడిన వారిని క్లోజ్డ్‌ లూప్‌లో ఉంచామని, రోజూ టెస్టింగ్ చేస్తున్నట్లు గతంలో సంస్థ వెల్లడించింది. అయితే వైరస్ సోకనివారి విషయంలో తగిన ఏర్పాట్లు లేవని సిబ్బంది ఆరోపించిన వీడియోలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని