Rimpac2022: ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విన్యాసాలకు రంగం సిద్ధం..!

ప్రపంచలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు సుదీర్ఘంగా జరగనున్న ఈ యుద్ధవిన్యాసాలకు అమెరికాలోని హోనోలువు,

Published : 02 Jun 2022 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు సుదీర్ఘంగా జరగనున్న ఈ యుద్ధ విన్యాసాలకు అమెరికాలోని హోనోలువు, శాన్‌డియాగో వేదికలు కానున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి. నాలుగు క్వాడ్‌ సభ్యదేశాలతోపాటు దక్షిణ చైనా సముద్రంలోని ఐదు దేశాలు దీనిలో పాలుపంచుకోనుండటం విశేషం. ఈ విన్యాసాల్లో 38 నౌకలు, నాలుగు జలాంతర్గాములు, 170 విమానాలు వినియోగించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా నౌకాదళం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వివిధ దేశాలకు చెందిన సాయుధ బలగాల్లోని 26,000 మంది దీనిలో పాల్గొననున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌తో తలపడుతున్న ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై దేశాలు కూడా రిమ్‌పాక్‌ 2022లో పాల్గొననుంటం విశేషం. ఇండోనేషియా, సింగపూర్‌లు కూడా ఈ యుద్ధ విన్యాసాల్లో భాగస్వాములు కానున్నాయి. మరోపక్క క్వాడ్‌ కూటమి కూడా ఈ యుద్ధవిన్యాసాలతో మరింత బలోపేతం కానుంది. గతేడాది నుంచి ఇప్పటికే క్వాడ్‌ నేతలు నాలుగు సార్లు భేటీ అయ్యారు. రిమ్‌పాక్‌2022లో పాల్గొనే మిగిలిన దేశాల్లో కెనడా, చిలీ, కొలంబియా, డెన్మార్క్‌, ఈక్వెడార్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇజ్రాయెల్‌, మెక్సికో, ది నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పెరూ, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, టోంగా, యూకే ఉన్నాయి. 

ఈ యుద్ధ విన్యాసాల్లో యాంఫీబియస్‌, గన్నరీ, క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్‌, ఎయిర్‌ డిఫెన్స్‌, కౌంటర్‌ పైరసీ, మైన్‌ క్లియరెన్స్‌, పేలుడు పదార్థాల తొలగింపు, డైవింగ్‌ అండ్‌ సాల్వేజ్‌ ఆపరేషన్‌ సామర్థ్యాలను ప్రదర్శించనున్నారని అమెరికా నౌకాదళం పేర్కొంది. వీటితోపాటు భాగస్వాములతో కలిసి సమష్టిగా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ కోసం పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని