Most Expensive Cities: అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్‌, సింగపూర్.. చౌకైన సిటీ ఇదే..

పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది.

Updated : 02 Dec 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 172 ప్రధాన నగరాలతో ఈ జాబితా విడుదల చేయగా.. న్యూయార్క్‌, సింగపూర్‌ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి. గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌ నగరం.. ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. ఇక, నాలుగో స్థానంలో హాంకాంగ్‌‌, ఐదో స్థానంలో లాస్‌ ఎంజిల్స్‌(అమెరికా), ఆరో స్థానంలో జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌), ఏడో స్థానంలో జెనీవా (స్విట్జర్లాండ్‌), ఎనిమిదిలో శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా), తొమ్మిదో స్థానంలో ప్యారిస్‌ (ఫ్రాన్స్‌), పదో స్థానంలో కోపెన్‌హ్యాగెన్‌ (డెన్మార్క్‌), సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరాలు ఉన్నాయి.

కాగా.. ప్రపంచంలోనే అత్యల్ప జీవన వ్యయమున్న నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్‌, లిబియాలోని ట్రిపోలి ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర 400 వ్యయాలపై సర్వే చేసి ఈ జాబితా రూపొందించారు. ఈ నగరాల సగటు జీవన వ్యయం గతేడాదితో పోలిస్తే 8.1శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో సరఫరా గొలుసుకు ఆటంకం ఏర్పడటం, ఇతరత్రా కారణాలతో సగటు జీవన వ్యయాలు పెరిగినట్లు ఈఐయూ సర్వే తెలిపింది.

ఎగుమతులు పెరగడంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఈ జాబితాలో టాప్‌10లో చోటు దక్కించుకుంది. గతేడాది 24వ స్థానంలో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కో ఈసారి 8వ స్థానానికి చేరుకుంది. దీన్ని బట్టి ఆ ప్రాంతంలో జీవన వ్యయం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, వడ్డీరేట్ల తగ్గుదలతో టోక్యో(జపాన్‌), ఒసాకా నగరాలు ఈ జాబితాలో వరుసగా 24, 33 స్థానాలకు పడిపోయాయని సర్వే తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని