Hijab Row: హిజాబ్‌ లేకుండా అంతర్జాతీయ పోటీల్లో.. ఇరాన్‌ క్రీడాకారిణికి అరెస్టు భయం..!

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ ఇరాన్‌ క్రీడాకారిణి (Athlete) కూడా హిజాబ్‌ లేకుండానే తన ఆటను కొనసాగించి వార్తల్లో నిలిచారు.

Published : 18 Oct 2022 18:30 IST

సియోల్‌: హిజాబ్‌కు (Hijab) వ్యతిరేకంగా ఇరాన్‌లో దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వేల మంది ఇరాన్‌ మహిళలు ప్రాణాలకు తెగించి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ ఇరాన్‌ క్రీడాకారిణి (Athlete) కూడా హిజాబ్‌ లేకుండానే తన ఆటను కొనసాగించి వార్తల్లో నిలిచారు. అయితే, దీనిపై ఇప్పటికే ఇరాన్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే అక్కడ నుంచి స్వదేశానికి పిలిపించారని.. అక్కడికి చేరగానే ఆమె అరెస్టు కావొచ్చని మీడియా పేర్కొంది.

దక్షిణ కొరియాలో జరుగుతోన్న ఏషియన్‌ క్లైంబింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇరాన్‌కు చెందిన ఎల్నాజ్‌ రెకాబీ (33) పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే సమయంలో తమ క్రీడాకారిణులు తప్పనిసరిగా హిజాబ్‌ ధరించాలని ఇరాన్‌ నిబంధనల్లో ఉంది. కానీ, రెకాబీ మాత్రం అలా ధరించలేదు. ఈ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె.. ఇరాన్‌లో జరుగుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకు మద్దతుగానే అలా చేసిందనే కోణంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆట ముగిసిన తర్వాత ఆ క్రీడాకారిణి కనిపించకుండా పోయిందనే వార్తలూ చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఆమె తన స్నేహితులకు ఫోన్లోలో అందుబాటులో లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఇలా అంతర్జాతీయ పోటీల్లో హిజాబ్‌ అంశం చర్చనీయాంశం కావడంతో చివరకు రెకాబీ స్పందించారు. హిజాబ్‌ ధరించకపోవడం ఉద్దేశపూర్వకంగా కాదని.. అనుకోకుండా అలా జరిగిందని వివరణ ఇచ్చారు. మరోవైపు క్లైంబింగ్‌ క్రీడాకారిణి కనిపించలేదంటూ వచ్చిన వార్తలను దక్షిణ కొరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఖండించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆమె బుధవారం స్వదేశానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. మంగళవారం ఉదయమే దక్షిణ కొరియా నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని