India-China: పంచశీల ఒప్పందం భేష్‌.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు

India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్‌ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Updated : 29 Jun 2024 11:31 IST

బీజింగ్‌: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత (India) విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని (Panchsheel Agreement) ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి ఆ ఐదు సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయన్నారు.

భారత్‌ - చైనా (India-China) మధ్య కుదిరిన ఒప్పందాన్ని ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి. చైనా-భారత్‌, చైనా-మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్‌పింగ్‌ (Xi Jinping) గుర్తుచేశారు.

‘‘మొదట ఈ పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1960ల్లో మొదలైన అలీనోద్యమానికీ ఈ ఐదు సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి. వర్తమాన సంఘర్షణలను అంతం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్‌ సెక్యూరిటీ ఇనిషియేటివ్‌లోనూ ఈ విధానాలను అనుసరించాలనుకుంటున్నాం’’ అని చైనా (China) అధినేత వెల్లడించారు.

ఏంటీ పంచశీల ఒప్పందం..

పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్‌ - చైనా మధ్య ఈ ఒప్పందం (Panchsheel Agreement) కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru), చౌ-ఎన్‌లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.

దీనిలోని అంశాలు:

  • సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించడం.
  • ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం.
  • దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం.
  • అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం.
  • పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని