China: కొవిడ్ కట్టడిలో చైనా భేష్.. ‘గోల్డ్‌ మెడల్‌’ మనకేనన్న జిన్‌పింగ్..!

కొవిడ్ కట్టడి వ్యూహాలను అమలు చేయడంలో చైనా గొప్పపనితీరు చూపిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కితాబిచ్చారు.

Published : 08 Apr 2022 23:25 IST

బీజింగ్: కొవిడ్ కట్టడి వ్యూహాలను అమలు చేయడంలో చైనా గొప్పపని తీరు చూపిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కితాబిచ్చారు. ఒక పక్క షాంఘై నగరం కరోనా ఉద్ధృతితో వణికిపోతోంది. మరోపక్క కఠిన ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలు తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ సమయంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహమ్మారి వేళ.. ఫిబ్రవరిలో చైనా వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ క్రమంలో క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్ల గౌరవార్థం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో మాట్లాడుతూ జిన్‌పింగ్ చైనా జీరో కొవిడ్ వ్యూహాన్ని ప్రశంసించారు. తమ విధానం మరోసారి పరీక్షను తట్టుకొని నిలబడిందన్నారు. ‘కొవిడ్ కట్టడి వ్యూహం అమలులో గనుక మెడల్స్ ఇచ్చే వెసులుబాటు ఉంటే.. చైనాకే స్వర్ణ పతకం వస్తుందని కొందరు విదేశీ అథ్లెట్లు నాతో అన్నారు’ అని జిన్‌పింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం చైనాలో షాంఘై నగరం వైరస్ కేంద్రంగా మారింది. దాంతో 26 మిలియన్ల మంది ప్రజలు కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అక్కడ 21 వేల కేసులు రాగా.. అందులో చాలా వరకు లక్షణ రహితంగానే ఉన్నాయి. మహమ్మారి తీవ్రత దృష్ట్యా బాధితుల కోసం 1,30,00 పడకలను సిద్ధంగా ఉంచినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. అయితే నిబంధనలు కఠినంగా ఉండటంతో ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనిపై అక్కడి ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని