Trevor Jacob: యూట్యూబ్‌ వీడియో కోసం విమానాన్నే కూల్చేసిన ఘనుడు..!

సోషల్‌ మీడియాలో వీక్షణల కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానాన్ని అడవుల్లో కూల్చేశాడు. కానీ, అమెరికాలోని ఫెడరల్‌ దర్యప్తు బృందం నిందితుడితో నిజం కక్కించింది.

Updated : 12 May 2023 10:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌ వీడియో వ్యూయర్‌షిప్‌ కోసం ఏకంగా విమానాన్నే కూల్చేశాడో ఘనుడు. అనంతరం దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. ‘అబ్బే నాకేం తెలీదు.. ఇంజిన్‌ విఫలమైంద’ని బుకాయించాడు. కానీ, అధికారులు పక్కా ఆధారాలతో ప్రశ్నించే సరికి తానే విమానం కూల్చేసినట్లు అంగీకరించాడు.

అమెరికాలోని ట్రెవొర్‌ జాకబ్‌.. ఒలింపిక్‌ స్నోబోర్డ్‌ క్రీడాకారుడు. అతడు 2014లో రష్యాలోని సోచిలో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ అమెరికా తరపున స్నోబోర్డ్‌లో సెమీఫైనల్స్‌ వరకు వెళ్లాడు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా పాల్గొన్నాడు. అతడికి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. దానిలో స్కైడైవింగ్‌, ఏవియేషన్‌, స్నోబోర్డింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసేవాడు. అతడి ఛానెల్‌కు లక్షమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2021 నవంబర్‌ 24న తన స్నేహితుడి చితాభస్మాన్ని వెదజల్లాలి అని చెప్పి లోంపోక్‌ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తీసుకొని ఒంటరిగా బయల్దేరాడు. అతడు లాస్‌ పాడ్రెస్‌ నేషనల్‌ పార్క్‌పై ఎగురుతుండగా విమానం కూలిపోయింది. పారాచూట్‌ సాయంతో ఆ ప్రమాదం నుంచి ట్రెవొర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తొలుత అందరూ అది ప్రమాదమే అనుకొన్నారు.

నెలరోజులకే వీడియో ప్రత్యక్షం

2021 డిసెంబర్‌ 24వ తేదీన ట్రెవొర్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘‘నేను విమానాన్ని కూల్చేశాను’’(I Crashed My Airplane) అనే టైటిల్‌తో ఓ వీడియో పోస్టు చేశాడు. విమానం ఇంజిన్‌లో సమస్యలు రావడంతో పారాచూట్‌ సాయంతో తాను బయటకు దూకాల్సి వచ్చిందని వెల్లడించాడు. అతడు బయటకు దూకే సమయంలో సెల్ఫీ స్టిక్‌ పట్టుకొని ఉన్నాడు. అంతేకాదు విమానం లాస్‌ పాడ్రెస్‌ నేషనల్‌ పార్క్‌ కూలడాన్ని పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలు భాగాల్లో అమర్చిన కెమెరాల్లో ప్రమాదాన్ని నిక్షిప్తం చేశాడు. నేను సురక్షితంగా బయటపడినందుకు సంతోషిస్తున్నా.. అని వీడియో చివర్లో చెప్పాడు. అనంతరం విమానం శిథిలాల వద్దకు అతడు చేరుకొని వాటిని చిత్రీకరించాడు. విమానానికి అమర్చిన కెమెరాల్లో డేటాను పూర్తిగా తీసుకొన్నాడు. 

శకలాలను మాయం చేసి..

కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో శకలాలు ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్‌ నమ్మబలికాడు. ఆ తర్వాత తన మిత్రుడితో కలిసి ఓ హెలికాప్టర్‌లో ప్రమాద స్థలానికి చేరుకొని విమాన శిథిలాలను అక్కడి నుంచి వేరే ప్రదేశానికి చేర్చి వాటిని ధ్వంసం చేశాడు. అనంతరం మిగిలిన భాగాలను ఎయిర్‌పోర్టు, ఇతర ప్రదేశాల వద్ద చెత్తలో పారేశాడు. కానీ, 2022లో ఫెడరల్‌ దర్యాప్తు బృందం   అతడు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదానికి పాల్పడ్డాడని నిర్ధారించింది. అతడు భారీ పారాచూట్‌తో లోంపోక్‌ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు. ఇది చిన్నసీటు విమానంలో ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు అతడి విమానానికి ముందే కెమెరాలు అమర్చినట్లు తేల్చారు. ఎట్టకేలకు ట్రెవొర్‌ ఫెడరల్‌ దర్యాప్తు బృందం ఎదుట తప్పును అంగీకరించాడు. ఉద్దేశపూర్వంగానే విమానాన్ని కూల్చివేసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించినట్లు అంగీకరించాడు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని