Ukraine Crisis: జపోరిజియాపై భీకర దాడులు.. 17 మంది మృతి!

జపోరిజియా నగరంపై జరిగిన భీకర క్షిపణి దాడుల్లో 17 మంది మృతి చెందారు. దాదాపు 40కిపైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ ఆదివారం ధ్రువీకరించింది. ఈ దాడుల్లో దాదాపు 50కిపైగా అపార్ట్‌మెంట్‌లు, 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.

Published : 09 Oct 2022 16:09 IST

కీవ్: ఒకవైపు రష్యా(Russia) సేనలపై ఉక్రెయిన్‌ బలగాలు పైచేయి సాధిస్తోన్నా.. మరోవైపు ఎడాపెడా దాడులతో పెద్దఎత్తున ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది. తాజాగా జపోరిజియా(Zaporizhzhia) నగరంపై జరిగిన భీకర క్షిపణి దాడుల్లో 17 మంది మృతి చెందారు. దాదాపు 40కిపైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ఆదివారం ధ్రువీకరించింది. ‘జపోరిజియా నగరంపై రాత్రి జరిగిన క్షిపణి దాడుల్లో దాదాపు 50కిపైగా అపార్ట్‌మెంట్‌లు, 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని జపోరిజియా సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనటోలీ కుర్తేవ్ వెల్లడించారు. నాలుగు విద్యాసంస్థలు కూడా ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.

ఈ దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. ‘మరోసారి జపోరిజియాను లక్ష్యంగా చేసుకున్నారు. శాంతియుత ప్రజలపై కనికరం లేకుండా చేపట్టిన దాడులు ఇవి. నివాస భవనాలపై.. అదీ అర్ధరాత్రి వేళలో..’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆరుగురు పిల్లలతోసహా 49 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని దుర్మార్గులు, ఉగ్రవాదులుగా అభివర్ణించారు. ‘ఇది క్రూరమైన చర్య. ఈ దాడులకు అనుమతి ఇచ్చిన వ్యక్తి నుంచి దీన్ని అమలు చేసిన ప్రతి ఒక్కరు.. చట్టం ముందు, ఉక్రెయిన్‌వాసుల ముందు జవాబుదారీగా ఉండాల్సిందే’ అని పేర్కొన్నారు. మరోవైపు.. తమ వద్ద పశ్చిమ దేశాల ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉంటే ఇటువంటి దాడులను అడ్డుకోవచ్చని ఉక్రెయిన్‌ సైన్యం ట్వీట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని