Ukraine Crisis: పుతిన్‌ హెచ్చరికలు ఉత్తి మాటలు కావు..!: అణు దాడిపై జెలెన్‌స్కీ

రష్యా(Russia)ను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ రష్యా అధినేత పుతిన్(Putin) చేసిన హెచ్చరికలను బుకాయింపుగా భావించడం లేదని ..

Published : 27 Sep 2022 01:44 IST

కీవ్‌: రష్యా(Russia)ను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ రష్యా అధినేత పుతిన్(Putin) చేసిన హెచ్చరికలను బుకాయింపుగా భావించడం లేదని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) అన్నారు. పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి అణు భయాలు(Nuclear Attack) పెరిగిపోయిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలు రష్యాపై అణు బెదిరింపులకు పాల్పడుతున్నాయని పుతిన్‌ ఆరోపించారు. దీనిపై స్పందించేందుకు మాస్కో వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయనీ ఆయన గుర్తు చేశారు. తమ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగితే, రష్యాతోపాటు ప్రజలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగిస్తామని తేల్చిచెప్పారు.

ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ తాజాగా ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘పుతిన్‌ గతంలో ఏదో బుకాయింపుగా ఈ తరహా హెచ్చరికలు చేసి ఉండొచ్చు! కానీ, ఇప్పుడవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ గతంలో చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను జెలెన్‌స్కీ ‘న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌’గా కొట్టిపారేశారు. అయితే, ప్రస్తుతం.. పుతిన్‌ ఉత్తి మాటలు చెబుతున్నట్లు అనుకోవడం లేదన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌లోని రెండు అణు ప్లాంట్ల సమీపంలో రష్యా చేసిన దాడులను.. అణ్వాయుధాల వినియోగం లేదా న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌కు సంకేతాలుగా పరిగణించవచ్చని అన్నారు. మరోవైపు.. రష్యా అణు యుద్ధం మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని