Zelensky: అక్కడేముంది ఆక్రమించుకోవడానికి.. శిథిలాలు తప్ప..!

రష్యా దురాక్రమణతో మేరియుపొల్‌ నగరం పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.

Updated : 07 May 2022 19:04 IST

తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్: రష్యా దురాక్రమణతో మేరియుపొల్‌ నగరం పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్ మినహా రష్యా ఆక్రమించుకోవడానికి ఇంకేం లేదని తీవ్రంగా మండిపడ్డారు. లండన్‌లో అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి చాథమ్ హౌస్ థింక్‌ ట్యాంక్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘మేరియుపొల్‌ను చేజిక్కించుకోవడం ఎన్నటికీ కుదరదు. శిథిలాలు తప్ప అక్కడేముంది ఆక్రమించుకోవడానికి. అది ఇప్పటికే పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ మిగిలింది ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే’ అంటూ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. మొదటి నుంచి వ్యూహాత్మక నగరమైన మేరియుపొల్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇప్పుడు అక్కడ మిగిలింది స్టీల్ ప్లాంట్ ఒక్కటే. దాంట్లో 200 మంది పౌరులున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. పౌరుల్ని తరలించేప్పుడు ఫైరింగ్ చేసిందని స్టీల్‌ ప్లాంట్‌కు రక్షణగా నిలిచిన సైనికులు ఆరోపించారు. కాగా, అక్కడి నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని తరలిస్తున్నామని అధ్యక్షుడు తెలిపారు. 

అలాగే సైనిక చర్యకు మునుపటి స్థితికి రష్యా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. అది శాంతి చర్చలకు చాలా అవసరమన్నారు. ‘ఆ పరిస్థితుల్లోనే మేం సాధారణంగా మాట్లాడుకోగలం. అలాగే మా భూభాగాన్ని తిరిగి తెచ్చుకోవడానికి దౌత్య మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. అంతేగాకుండా మేరియుపొల్‌లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించొచ్చనే రష్యా ప్రణాళికను ఆయన ప్రస్తావించారు. ‘మే 9న పుతిన్‌ ప్రభుత్వం పరేడ్‌ను నిర్వహించాలనుకుంటుంది. అది నాకు అర్థమైంది’ అని వ్యాఖ్యానించారు. నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న రష్యాలో వేడుక చేస్తారు. 

ఇదిలా ఉండగా.. జెలెన్‌స్కీ ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. జర్మనీ ఛాన్సలర్ అధ్యక్షతన జరగనున్న జీ7 సమావేశంలో బైడెన్ పాల్గొననున్నారు. ఆ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు హాజరుకానున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ యుద్ధం రెండు దేశాలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతోంది. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడుతోంది. ఇప్పటివరకూ 5.5 మిలియన్ల ఉక్రెయిన్ వాసులు వారి స్వస్థలాలను వీడారు. మరోపక్క రష్యాకు చెందిన 24 వేల మంది సైనికుల్ని అంతం చేసినట్లు ఉక్రెయిన్ వర్గాలు ప్రకటించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని