Ukraine Crisis: రష్యా ప్రణాళికను దెబ్బతీశాం.. కీవ్‌ మా ఆధీనంలోనే ఉంది..!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

Updated : 26 Feb 2022 18:47 IST

వెల్లడించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

కీవ్: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. తన ప్రభుత్వాన్ని కూలదోసి, ఒక తోలుబొమ్మను కొలువుదీర్చాలని పుతిన్‌ చూస్తున్నారని ఆరోపించారు. తమపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న దాడిని ఆపేలా రష్యన్లు ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే ఈ సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న రష్యన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.  

‘రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్‌ ఇప్పటికీ ఉక్రెయిన్‌ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి’ అని జెలెన్‌స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యన్‌ సేనలు ‘క్షిపణులు, ఫైటర్‌లు, డ్రోన్‌లు, ఫిరంగిదళాలు, సాయుధ వాహనాలు, విధ్వంసకారులు, వైమానిక దళాలు’ ను మోహరించాయి. నివాస ప్రాంతాలపై కూడా దాడి చేశాయని మండిపడ్డారు. కీవ్‌తో సహా ప్రధాన నగరాల్లో ఉక్రేనియన్లు రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వెల్లడించారు. మరికొన్ని నగరాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. 

అలాగే యూరోపియన్ యూనియన్‌(ఈయూ)లో చేరే హక్కును ఉక్రెయిన్‌ ఇప్పటికే  పొందిందని, ఈయూ నేతలు అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా స్విఫ్ట్‌ నుంచి రష్యాను డిస్‌కనెక్ట్‌ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు. జర్మనీ, హంగరీ కూడా ఇప్పుడు ఆ ధైర్యం చేస్తాయన్నారు. ఇంకోపక్క ఈ సైనిక చర్యను వ్యతిరేకించిన రష్యన్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తీరుగా పుతిన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని అభ్యర్థించారు. మనకు, ఈ ప్రపంచానికి అబద్ధాలు చెప్పేవారిని నిలువరించాలని కోరారు. ‘వేల సంఖ్యలో బాధితులు, వందల సంఖ్యలో ఖైదీలుగా ఉన్నారు. యుద్ధం తక్షణం ఆగిపోవాలని మీరు ఎంత త్వరగా ప్రభుత్వానికి చెబితే.. అంత ఎక్కువమంది బతుకుతారు’ అని జెలెన్‌స్కీ తాజా వీడియో సందేశంలో వెల్లడించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని