Ukraine Crisis: పుతిన్‌ ఉన్నంత వరకు చర్చలకు వెళ్లం: జెలెన్ స్కీ

ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. పుతిన్‌ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆదేశంతో చర్చలు జరపబోమని తేల్చి చెప్పారు.

Published : 01 Oct 2022 02:26 IST

కీవ్‌: ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్క్స్‌,దొనెట్క్స్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ప్రకటించడంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. వీలైనంత తొందరగా ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్పించుకోవాలని ఆ కూటమి దేశాలను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘నాటో కూటమిలో చేరేందుకు మాకున్న అర్హతలను ఇప్పటికే నిరూపించుకున్నాం. నాటోలో వీలైనంత తొందరగా ప్రవేశించేందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేయడం ద్వారా నిర్ణయాత్మక ముందడుగు వేస్తున్నాం’’ అంటూ జెలెన్ స్కీ తన వీడియోలో పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ ఉన్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.‘‘రష్యా అధ్యక్ష పదవిలో పుతిన్‌ ఉన్నంతవరకు ఉక్రెయిన్‌ ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోదు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాక మేం చర్చలకు సిద్ధంగా ఉంటాం’’అని పేర్కొన్నారు.

దాదాపు ఎనిమిది నెలలుగా జరుగుతున్న యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఉక్రెయిన్‌లోని ఈ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తూ.. చర్చలకు రావాలని ఉక్రెయిన్‌కు సూచించారు. కొత్తగా విలీనం చేసుకున్న ప్రాంతాలను మాత్రం రష్యా ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదని పుతిన్‌ తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని