Published : 28 Jun 2022 02:11 IST

Ukraine Crisis: ఈ ఏడాదిలోపు యుద్ధం ముగిసేలా చూడండి.. జీ-7 నేతలకు జెలెన్‌స్కీ అభ్యర్థన!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా.. ఇంతవరకూ ముగింపు ఛాయలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది చివరినాటికైనా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. జీ-7 నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రష్యాపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించారు. జర్మనీలో కొనసాగుతోన్న జీ-7 శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి సోమవారం జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్న క్రమంలో తమ బలగాలకు యుద్ధ పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయని చెప్పారు. శీతాకాలం తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుండటంతో తీవ్రత పెరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేయడంతోసహా ఏడాది చివరినాటికి యుద్ధాన్ని ముగించేందుకు శాయశక్తులా కృషి చేయాలని కోరారు. రష్యాపై ఆంక్షల ఒత్తిడిని తగ్గించొద్దని, మరిన్ని చర్యలు తీసుకుంటూనే ఉండాలని పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

‘వారిని వెతికి పట్టుకుంటాం..’

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని నివాసిత ప్రాంతాలపై దాడులకు పాల్పడుతున్న రష్యన్‌ వైమానిక సేన పైలెట్లను పట్టుకుని తీరాతమంటూ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాదాపు మూడు వారాల తర్వాత ఆదివారం కీవ్‌లోని భవనాలపై రష్యన్‌ బలగాలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ స్పందించారు. ‘పైలట్లు, ఆయుధాలను ప్రయోగించేవారు.. ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పట్టుకుంటాం. ఈ దాడులకు మీలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తారు. మీ క్షిపణులు నివాస భవనాలను తాకుతున్నాయి. ఇది యుద్ధ నేరం. మీ అందరి కోసం తీర్పు వేచి ఉంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధానికి దూరంగా జరగాలంటూ బెలారస్‌కు సూచించారు. ‘రష్యా మిమ్మల్ని యుద్ధంలోకి లాగుతోంది. మీ జీవితాలంటే ఆ దేశానికి లెక్కలేదు. కానీ, మీరు బానిసలు కాదు. చనిపోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts