Zelenskyy: మాకు ఆయుధాలు ఇవ్వండి.. రష్యాపై గరిష్ఠ ఆంక్షలు విధించండి..!

తన దేశంపై రష్యా జరుపుతోన్న దురాక్రమణను ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఎండగడుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తాజాగా దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.

Published : 23 May 2022 22:37 IST

ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగం

దావోస్‌: తమ దేశంపై రష్యా దురాక్రమణను ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఎండగడుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తాజాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. పొరుగు దేశంపై దాడికి దిగిన రష్యాపై గరిష్ఠస్థాయిలో ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో తమకు తగినన్ని ఆయుధాలు ఇవ్వాలని కోరారు.  

‘రష్యా వంటి దేశాలు పొరుగు దేశాలపై దాడికి దిగకుండా ఆంక్షలే నిరోధిస్తాయి. రష్యా చమురుపై పూర్తి నిషేధం, అన్ని రష్యన్ బ్యాంకులను ప్రపంచ వ్యవస్థల నుంచి నిషేధించడం, రష్యాతో వాణిజ్యానికి దూరంగా ఉండటం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ తరహా కఠిన ఆంక్షలు అమలులో లేవని భావిస్తున్నాను. అలాగే రష్యాను ఎదుర్కొవడానికి మాకు మరిన్ని ఆయుధాలు కావాలి. తగిన సమయంలో ఆయుధాలు అంది ఉంటే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలతో ఉండేవారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటికీ రష్యాను వీడని సంస్థలు, ఇప్పటికైనా ఆ దేశాన్ని విడిచివెళ్లాలని కోరారు. అలాగే ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి ముందుకు రావాలని అభ్యర్థించారు. ఇక తన ప్రసంగాన్ని ముగించేముందు తన దేశం పునర్‌ వైభవం పొందాలని ఆకాక్షించారు. ఈ సమావేశంలో సభ్యుల నుంచి ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. 

రోజుకు 50 నుంచి 100 మరణాలు..

ఈ సంక్షోభం కారణంగా తమ తూర్పు ప్రాంతంలో నిత్యం 50 నుంచి 100 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం నిలబడి వారు మృత్యుఒడికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ తూర్పు ప్రాంతంలో జరుగుతోన్న భీకర పోరాటానికి, సైనిక నష్టానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రష్యా కూడా అంతే నష్టాన్ని చవిచూస్తోందని యూకే రక్షణ శాఖ వెల్లడించింది. నిఘా సమాచారం ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఇదిలా ఉంటే.. ఈసారి ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధమే ప్రధానాంశంగా ఉంది. దీన్ని ముందుగానే గమనించిన రష్యా గైర్హాజరైంది. ఆ దేశం నుంచి ఏ ఒక్క ప్రతినిధి పాల్గొనలేదు. మరోపక్క ఈ వేదికపై రష్యా ప్రతినిధులు ఉపయోగించే రష్యా హౌస్‌ను ఉక్రెయిన్‌ కళాకారులు ‘రష్యా వార్‌ క్రైమ్‌ హౌస్‌’గా మార్చారు. ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న విధ్వంసాన్ని చిత్రాల రూపంలో ప్రదర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని