Zelenskyy: రష్యాపై మరిన్ని ఆంక్షల నిర్ణయం వేళ.. జపాన్‌లో అడుగుపెట్టిన జెలెన్‌స్కీ!

జీ7 సదస్సులో పాల్గొనేందుకుగానూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జపాన్‌కు చేరుకున్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్‌స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 20 May 2023 14:31 IST

టోక్యో: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా సైనిక చర్య 15 నెలలకుపైగా కొనసాగుతోన్న వేళ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) నేడు జపాన్‌ (Japan) చేరుకున్నారు. అగ్రరాజ్యాల జీ7 సదస్సు (G7 Summit)లో పాల్గోనేందుకుగానూ ఆయన ఇక్కడి హిరోషిమా (Hiroshima)లో అడుగుపెట్టారు. రష్యా దాడులు మొదలైన అనంతరం జెలెన్‌స్కీ పర్యటిస్తోన్న మొదటి ఆసియా దేశం ఇది. ఇందులో భాగంగా ఆయన జీ7 దేశాల ప్రతినిధులతోపాటు ఇతర ఆహ్వానిత దేశాల నేతలతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌- రష్యా వివాదంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జీ7 సదస్సులో భాగంగా సభ్యదేశాలు ఉక్రెయిన్‌పై ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి. ‘ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న చట్టవిరుద్ధ, అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలనే జీ7 దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘిస్తోన్న రష్యా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రయత్నాలన్నింటినీ సమీకరించి.. ఉక్రెయిన్‌తో కలిసి పని చేస్తామని ‘శాంతికి చిహ్నం’ అయిన హిరోషిమా వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన దిశగా సహకరిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి.

జపాన్‌ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర నేతలతో విడిగా భేటీ కానున్నట్లు సమాచారం. అంతకుముందు హిరోషిమాకు చేరుకున్న సందర్భంగా ‘జీ7 సదస్సులో భాగంగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు, భాగస్వాములతో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నా. రష్యాపై విజయం కోసం మరింత భద్రత సహకార చర్యలను ఆకాంక్షిస్తున్నా. నేడు శాంతిస్థాపన మరింత సమీపించింది’ అని జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్‌స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని