Published : 18 May 2022 14:23 IST

Zelensky: ఇప్పుడు మరో ఛార్లీ చాప్లిన్‌ రావాలేమో..: జెలెన్‌స్కీ

కేన్స్‌ వేడుకలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం

కేన్స్‌(ఫ్రాన్స్‌): రష్యా దండయాత్రలో నలిగిపోతున్న తమకు అండగా నిలిచి.. క్రెమ్లిన్‌ దురాగతాలను గొంతెత్తి చాటాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్‌ వేడుక ఫ్రాన్స్‌లో మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ప్రసంగం చేశారు.

‘‘మా దేశంపై రష్యా జరుపుతోన్న దాడుల్లో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా? లేదా మాట్లాడుతుందా? ఓ నియంత యుద్ధం మొదలుపెడితే.. స్వేచ్ఛ కోసం ఓ పోరాటం జరుగుతుంటే.. ప్రపంచమంతా ఏకమవ్వాలి. ఈ ఐకమత్యానికి సినిమా దూరంగా ఉంటుందా? రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఛార్లీ చాప్లిన్‌ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’.. ప్రస్తుత ఉక్రెయిన్‌ పరిస్థితులకు భిన్నంగా ఏం లేదు. చాప్లిన్‌ డిక్టేటర్‌.. నిజమైన నియంతను నాశనం చేయలేకపోవచ్చు. కానీ అలాంటి దారుణాల పట్ల సినీ ప్రపంచం మౌనంగా ఉండదని మాత్రం ఆ చిత్రం చాటిచెప్పింది. ఇప్పుడు కూడా సినీ ప్రపంచం నిశ్శబ్దంగా ఉండబోదని రుజువు చేసేందుకు మనకు కొత్త చాప్లిన్‌ అవసరం’’ అని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాలో చాప్లిన్‌ చెప్పిన ఓ డైలాగ్‌ను జెలెన్‌స్కీ గుర్తుచేసుకున్నారు. ‘‘మనుషుల మధ్య ద్వేషం పోతుంది. నియంతలు మరణిస్తారు. ప్రజల నుంచి వారు బలవంతంగా తీసుకున్న అధికారం.. తిరిగి ప్రజలకు వస్తుంది’’ అని ఆయన చెప్తుండగా.. వేడుకకు హాజరైన వారంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతించారు. ఉక్రెయిన్‌లో వేలాది మంది మరణిస్తుంటే సినీ దర్శకులు మౌనంగా ఉండకూడదని, సినిమా ఎప్పుడూ స్వేచ్ఛవైపే ఉంటుందని నిరూపించాలని జెలెన్‌స్కీ అభ్యర్థించారు. ఈ వేడుకలో భాగంగా ఉక్రెయిన్‌ దర్శకుడు మాంటాస్‌ రూపొందించిన ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్‌ డిస్ట్రక్షన్‌ ’ డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీ తీసిన కొద్ది రోజులకే మాంటాస్‌.. మేరియుపోల్‌లో రష్యా జరిపిన దాడుల్లో మరణించడం గమనార్హం.

రష్యా దండయాత్రతో అల్లాడిపోతోన్న తమకు అండగా నిలవాలంటూ గత కొన్ని రోజులుగా జెలెన్‌స్కీ యావత్‌ ప్రపంచాన్ని కోరుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు దేశాల చట్టసభల సమావేశాల్లో వర్చువల్‌గా పాల్గొని అభ్యర్థించిన ఆయన.. ఆ మధ్య అంతర్జాతీయ సంగీత వేడుక గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవంలోనూ వీడియో సందేశమిచ్చారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని