Zelenskyy: 3-5 రోజులు చాలనుకున్నారు..36 రోజులైంది..!

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నెల రోజులు దాటిపోయింది. ఆయినా ఆ సైనిక శక్తికి ఎదురొడ్డి నిలిచి, ఉక్రెయిన్ ఇంకా పోరాటం కొనసాగిస్తోంది.

Published : 01 Apr 2022 13:24 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నెల రోజులు దాటిపోయింది. ఆయినా ఆ సైనిక శక్తికి ఎదురొడ్డి నిలిచి, ఉక్రెయిన్ ఇంకా పోరాటం కొనసాగిస్తోంది. శత్రుదేశం అంచనాలను మించి తాము చాలా బలంగా నిలబడ్డామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

‘శత్రువు ఊహించినదానికంటే ఎక్కువకాలం ఎదురొడ్డి నిలిచి ఉన్నాం. వారు మూడు నుంచి ఐదు రోజులని అంచనా వేశారు. మన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ సమయం చాలనుకున్నారు. కానీ ఇప్పటికే 36 రోజులైంది. మేమిప్పటికీ పోటీ ఇస్తున్నాం. మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం’ అంటూ జెలెన్‌స్కీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

అలాగే ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించడం ముఖ్యమన్నారు. ‘ఏం జరిగినా.. ఇప్పుడు మనం భవిష్యత్తు గురించి ఆలోచించడం ముఖ్యం. ఈ యుద్ధం తర్వాత ఉక్రెయిన్ భవిష్యత్‌ ఏంటి..? మన జీవితాలు ఎలా ఉంటాయి..? అని ఆలోచించాలి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు కోసం చేస్తోన్న పోరాటం’ అని వెల్లడించారు. 

సైనిక చర్య పేరిట ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టింది. సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు అని తేడా లేకుండా దాడులు నిర్వహిస్తోంది. దాంతో దాదాపు కోటిమందికి పైగా తమ స్వస్థలాలను వీడినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధ విరమణకు ఇరు దేశాల మధ్య చర్చలు కూడా సాగుతున్నాయి. మార్చి 29న జరిగిన సమావేశంలో కాస్త పురోగతి కనిపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోజు మరోదఫా చర్చలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని