Zelenskyy: ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో..? ముగింపు ఎప్పుడో..?

‘ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో..’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిరాశ వ్యక్తం చేశారు.

Published : 15 May 2022 01:52 IST

ఎవరూ ఊహించలేరన్న జెలెన్‌స్కీ

కీవ్‌: ‘ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో..’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశం నుంచి రష్యన్లను వెళ్లగొట్టేందుకు మా సైనికులు చేయాల్సిందంతా చేస్తున్నారని చెప్పారు. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు.  

‘ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. మా సైనికులు అత్యున్నతంగా పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ దీని ముగింపు మా ఒక్కరిపైనే ఆధారపడిలేదు. ఇది మా భాగస్వాములపై ఆధారపడి ఉంటుంది. ఐరోపా దేశాలపై, మొత్తం స్వేచ్ఛా ప్రపంచంపై ఆధారపడి ఉంటుంది’ అని జెలెన్‌స్కీ వీడియో సందేశం ఇచ్చారు. అలాగే రష్యాపై ఆంక్షలను మరింత కఠినతం చేసేందుకు, ఉక్రెయిన్‌కు సహకరిస్తోన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

అలాగే రష్యాకు చెందిన 200వ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ సైన్యం కూల్చివేసిందని జెలెన్‌స్కీ తెలిపారు. ట్యాంకులు, వాహనాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లను రష్యా భారీగా నష్టపోయిందని చెప్పారు. అంతేగాకుండా మేరియుపొల్‌ స్టీల్‌ప్లాంట్‌లో గాయాలతో చిక్కుపోయిన సైనికుల కోసం తాము కష్టతరమైన చర్చలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పుతిన్‌ సేనల నుంచి తమ పట్టణాలు, గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, అక్కడ నిత్యావసర సదుపాయాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. మరోపక్క యుద్ధం నిలిపివేతపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌ 75 నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, క్షేత్రస్థాయిలో మానవతా పరిస్థితి మెరుగుపడేలా చూడాలని కోరినట్లు జర్మనీ ప్రతినిధి వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని