Zelenskyy: పుతిన్‌తో చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధమే..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉద్ఘాటించారు.

Published : 21 Mar 2022 01:35 IST

యుద్ధం ముగింపునకు చర్చలు ఒక్కటే మార్గమన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

కీవ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉద్ఘాటించారు. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే మాత్రం ఇది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుందని హెచ్చరించారు. రష్యా సైనిక చర్య మొదలుపెట్టి నాలుగు వారాలు పూర్తికావొస్తున్నా.. పుతిన్‌ నుంచి సానుకూల ప్రకటన రాని నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు.

‘నేను పుతిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నాను. గత రెండేళ్ల నుంచి రెడీగా ఉన్నా. చర్చలు లేకుండా యుద్ధానికి ముగింపు పలకలేమని నా అభిప్రాయం. పుతిన్‌తో ఏదైనా ఒక పద్ధతిలో చర్చలు జరిపేందుకు అవకాశం రావాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం.. ఇది మూడో ప్రపంచ యుద్ధమేనని అర్థం’ అని ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

‘తాము ఎప్పుడూ సంప్రదింపులకే పట్టుబడుతున్నాం. చర్చలతోపాటు శాంతిస్థాపనకు ఉన్న పరిష్కారాలను చెబుతూనే ఉన్నాం. ముఖ్యంగా మాస్కోకు మరోసారి చెబుతున్నా.. కలిసి చర్చించుకోవాల్సిన సమయం. ఉక్రెయిన్‌కు న్యాయం జరగడంతోపాటు ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించుకోవాల్సిన సమయం’ అంటూ జెలెన్‌స్కీ వెల్లడించారు. భద్రతా హామీలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడమే చర్చల్లో ప్రధానాంశాలన్న ఆయన.. ఈ యుద్ధం ముగించాలంటే చర్చలు ఒక్కటే మార్గమన్నారు.

ఇదిలా ఉంటే, నాలుగు వారాలుగా కొనసాగుతున్న భీకర దాడులతో ఉక్రెయిన్‌ నగరాలు వణికిపోతున్నాయి. తాజాగా మేరియుపొల్‌ నగరంపై జనసమూహాలపై చేస్తున్న దాడులతో కుప్పకూలుతున్న భవనాల కింద వందల మంది చిక్కుకుపోతున్నారు. ఈ దాడులపై స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బలగాల చేస్తున్న దాడులు మాయని మచ్చలా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విచక్షణారహితంగా జరుపుతున్న ఈ దాడులు యుద్ధ నేరాల కిందకే వస్తాయని పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని