Zimbabwe: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశం!

ప్రపంచంలో అత్యంత దయనీయ (Most Miserable) పరిస్థితిలో జింబాబ్వే ఉన్నట్లు స్టీవ్‌ హాంకే ‘వార్షిక దయనీయ సూచిక (HAMI)’ వెల్లడించింది.

Published : 24 May 2023 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే (Zimbabwe) నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకే ‘వార్షిక దయనీయ సూచిక (HAMI)’ ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌, సిరియా, సూడాన్‌ దేశాల కంటే ఇక్కడి పరిస్థితులు దయనీయంగా (Most Miserable) ఉండటం గమనార్హం. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలిస్థానంలో నిలిచింది.

‘అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, అతి నిరుద్యోగిత, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి.. ఇలా అన్నీ కలిపి జింబాబ్వేని ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో (Hanke 2022 Annual Misery Index) తొలిస్థానంలో నిలిపాయి, ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరముందా?’ అని ఆర్థికవేత్త స్టీవ్‌ హాంకే వెల్లడించారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్టీవ్‌.. అధికారంలో ఉన్న జెడ్‌ఏఎన్‌యూ-పీఎఫ్‌ పార్టీతోపాటు ఆ ప్రభుత్వ విధానాలే జింబాబ్వేలో ఈ దుస్థితికి కారణమన్నారు. ఈ జాబితాలో వెనిజువెలా, సిరియా, లెబనాన్‌, సూడాన్‌, అర్జెంటీనా, యెమెన్‌, ఉక్రెయిన్‌, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘానా దేశాలు తొలి 15 దయనీయ దేశాల వరుసలో ఉన్నాయి.

మరోవైపు హెచ్‌ఏఎంఐ స్కోరును అతితక్కువ పొందిన దేశంగా స్విట్జెర్లాండ్‌ నిలిచింది. అంటే.. ఆ దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అర్థం. రెండో స్థానంలో కువైట్‌ ఉండగా, ఐర్లాండ్‌, జపాన్‌, మలేసియా, తైవాన్‌, నైజర్‌, థాయిలాండ్‌, టోగో, మల్టా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ మాత్రం 103 స్థానంలో ఉంది. మనదేశం దయనీయ స్థితిలో ఉండటానికి నిరుద్యోగం కారణమని తాజా నివేదిక పేర్కొంది. అమెరికా కూడా 134 స్థానంలో ఉందని.. ఇందుకు అక్కడి నిరుద్యోగమే ప్రధాన కారణమని తెలిపింది. ఇక వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ రిపోర్టులో గత ఆరేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫిన్లాండ్‌ మాత్రం ఈ జాబితాలో 109వ స్థానంలో ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు