ఆ రోజులు గుర్తొస్తే భయమేస్తుంది: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 20/06/2021 19:06 IST

ఆ రోజులు గుర్తొస్తే భయమేస్తుంది: కేసీఆర్‌

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, సమీకృత కలెక్టరేట్‌, ఆధునిక సదుపాయాలతో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగారని.. తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గతంలో తాగు, సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయని.. నీటితో కళకళలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్, మే నెలల్లోనూ పొంగిపొర్లాయన్నారు. వీటి కోసమే తెలంగాణ సాధించుకున్నామని.. అందుకు ఎంతో గర్వంగా ఉందని సీఎం అన్నారు.

ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలలి..

పాలనా సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంచి ఉద్దేశంతోనే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు అందాలనే సదుద్దేశంతోనే సంస్కరణలు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలన్నారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని తరాలు నష్టపోతయాని పేర్కొన్నారు. అందుకే తొలి ప్రాధాన్యతగా విద్యుత్‌ సమస్యను పరిష్కరించామన్నారు. పట్టుదల, లక్ష్యంతో సమస్యను పరిష్కరించినట్లు వివరించారు. రాష్ట్రంలో మంచినీళ్ల సమస్య లేకుండా మిషన్‌ భగీరథను ప్రారంభించామన్నారు. మంచి ఆలోచనతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని సైతం కొంత మంది విమర్శిస్తున్నారని సీఎం మండిపడ్డారు.

అందుకే రైతుబంధు ప్రారంభించాం..

‘‘తెలంగాణలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది. 1.65 కోట్ల ఎకరాల భూమి రైతుల చేతిలో ఉంది. ప్రతి 5వేల ఎకరాలకు ఓ రైతు వేదిక ఏర్పాటు చేశాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనలతో సంస్కరణలు చేపట్టాం. రైతు వేదికల్లో వెంటనే సమావేశాలు ప్రారంభించాలి. గుజరాత్, తమిళనాడులో పత్తి బాగా పండుతుంది. కానీ అక్కడి పరిశ్రమలు తెలంగాణ పత్తి కొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రపంచంలో పండే 4రకాల మేలైన పత్తిలో తెలంగాణలో పండేది ఒకటి. రైతులు పత్తి సాగు మీద కూడా దృష్టి సారించాలి. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 50 జిన్నింగ్ మిల్లులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 400కు పెరిగింది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు మీద ఆధారపడి అనేక వర్గాలు జీవిస్తున్నాయి. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తారనే ఉద్దేశంతోనే రైతుబంధు ప్రారంభించాం. అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నాం’’ అని తెలిపారు.

ఆ అధికారం ఎవరికీ లేదు..

‘‘తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. భూసమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పోర్టల్‌ తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాం. గతంలో రైతులకు ఏడిపించి భద్రత లేకుండా చేశారు. ధరణిలో భూమిని నమోదు చేసుకున్న అన్నదాతలు నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని