Corona: వైరస్‌ను జయించినా మరో వేదన!
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: వైరస్‌ను జయించినా మరో వేదన!

నిస్సత్తువ.. కీళ్ల నొప్పులు చెమటలు.. ఆయాసం 

 ప్రస్తుతం ప్రతి పది మందిలో ఆరుగురికి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటున్న వైద్యులు 

ఎక్కువ ఇబ్బందులు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచన 

*పంజాగుట్టకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ హోం ఐసొలేషన్‌లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇరవై రోజులు అవుతున్నా కీళ్ల నొప్పులు, నిస్సత్తువ తగ్గడం లేదు. రెండొందల మీటర్లు నడిస్తే కాళ్లు గుంజుతున్నాయంటున్నారు. ఈయన ఒక్కరే కాదు వరంగల్‌కు చెందిన గృహిణి శ్రీలత, నిజామాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వరదరాజుదీ ఇదే పరిస్థితి.

*నిజామాబాద్‌కు చెందిన వ్యాపారి శ్రీపతికి కొవిడ్‌ రావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరి స్టెరాయిడ్లు, ప్రాణ వాయువుతో చికిత్స పొందారు. ఇంటికి చేరుకుని పక్షం రోజులు అవుతోంది. ఒక అంతస్తు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తోందని... విపరీతంగా చెమట పడుతోందని వివరించారు. 

ఈనాడు, హైదరాబాద్, నిజామాబాద్‌: కరోనా వచ్చి పోయింది... బయటపడ్డాంలే అని అనుకుంటున్న వారిని అనేక ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. హృదయ సంబంధ సమస్యలైతే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కొందరిలో తీవ్రమైన ఒంటి నొప్పులు, నీరసం, కీళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. కనీసం వంద మీటర్లు వేగంగా నడవలేని దుస్థితి మరికొందరిది. తీవ్రంగా చెమట పట్టడం, ఆయాసం, నిస్సత్తువ, నిద్రలేమి నిలువునా కుంగదీస్తున్నాయి. కరోనా రెండో దశలో ప్రతి పది మందిలో ఆరుగురికి దాదాపు ఇవే సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ అనంతరం శరీర మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించడం కీలకమని చెబుతున్నారు.

ఈ లక్షణాలను గమనిస్తూ ఉండాలి 
*గుండె సాధారణం కన్నా వేగంగా కొట్టుకుంటున్నా 
*నడిచినా, మెట్లు ఎక్కినా ఎక్కువ సేపు ఆయాసం వస్తున్నా  
*చిన్న పనిచేసినా చెమటలు ఎక్కువగా పడుతున్నా 
*అర్ధరాత్రి ఒక్కసారి గుండె వేగం పెరిగినా 
ఎలాంటి ఆహారం తీసుకోవాంటే...
*యాంటి ఆక్సిడెంట్లు ఉన్నవి 
*ఆకుకూరలు, కూరగాయలు 
*గుడ్డు, మాంసకృత్తులు  
*చిరు ధాన్యాలు 
*డ్రై ఫ్రూట్స్‌ (బాదం, పిస్తా, అంజీర్, వాల్‌నట్స్‌) 

కొవిడ్‌ ఊపిరితిత్తులను బలహీనం చేస్తుంది 

అవయవాలకు ప్రాణవాయువు సక్రమంగా అందకపోతే అనేక సమస్యలు ఏర్పడతాయి. ఆ అవయవాలపై ఒత్తిడి పెరిగితే అక్కడ నొప్పులు వస్తాయి. కొవిడ్‌ సోకిన వ్యక్తిలో సోడియం, పొటాషియం లాంటివి తగ్గిపోతాయి. తగినంత ప్రాణవాయువు శరీరంలో లేకపోయినా నిస్సత్తువగా అనిపిస్తుంది. కరోనా ఊపిరితిత్తులను బలహీనం చేస్తుంది. కొందరిలో చిల్లులు పెడుతుంది. స్టిరాయిడ్లు, ఇతర మందులు వాడిన వారిలో కొందరికి రక్తం చిక్కబడుతుంది. ఎక్కడైనా రక్తనాళాల్లో నిలిచిపోతే పక్షవాతం, గుండెపోటు లాంటివి వస్తాయి. వైరస్‌ను జయించి బయటపడిన వారిలో పది నుంచి పదిహేను శాతం మందిలో పక్షం రోజుల నుంచి రెండు మూడు నెలల వరకు అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. నిత్యం వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా కొన్నింటి నుంచి బయటపడవచ్చు.
-డాక్టర్‌ మహబూబ్‌ఖాన్, పల్మనాలజిస్ట్, 
సూపరింటెండెంట్, హైదరాబాద్‌ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి 

కొత్తగా బయటపడుతున్న మధుమేహం, థైరాయిడ్‌

కోలుకున్నాక తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అధిక మోతాదులో స్టిరాయిడ్ల వినియోగంతో రక్తంలో గ్లూకోజ్‌ పాళ్లు పెరిగి కొత్తగా మధుమేహ రోగులు తయారవుతున్నారు. థైరాయిడ్‌ కణజాలంపై వైరస్‌ ప్రభావం చూపడం వల్ల అది మరింత పెరుగుతోంది. కొందరిలో అంతకు ముందు థైరాయిడ్‌ లేకపోయినా కొత్తగా  బయటపడుతోంది. కొవిడ్‌ నుంచి బయట పడ్డాక రక్త పరీక్షలు చేయించుకుని.. ఫలితాల ప్రకారం వైద్యం పొందాలి. కరోనా అనంతరం మూడు నుంచి ఆరు వారాల వరకు ఈ నీరసం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 
- డాక్టర్‌ జలగం తిరుపతిరావు, 
ఫిజీషియన్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్యశాల, నిజామాబాద్‌   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని