TS News: ఆసిఫాబాద్‌లో ఆదిమ మానవుల కాలం నాటి సున్నపు రాతి గుహ

తాజా వార్తలు

Updated : 24/07/2021 11:17 IST

TS News: ఆసిఫాబాద్‌లో ఆదిమ మానవుల కాలం నాటి సున్నపు రాతి గుహ

ఈనాడు, హైదరాబాద్‌: ఆసిఫాబాద్‌ జిల్లా అటవీప్రాంతంలో గిరిజనులు అర్జునలొద్దిగా పిలుచుకునే ప్రాంతం ఆదిమ మానవుల కాలం నాటిదని, పాతరాతియుగంలో ఇక్కడ మానవ సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు రాతి పనిముట్ల రూపంలో దొరికాయని చరిత్రకారుడు, పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్‌ వెల్లడించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోకి వచ్చే అర్జునలొద్ది గుహ 1.25 లక్షల ఏళ్ల నుంచి 11 వేల ఏళ్ల మధ్య జరిగిన మార్పులతో ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ప్రకృతి తొలచిన అందమైన గుహల్లో అర్జునలొద్ది ఒకటి. తిర్యాణి మండలం మేశ్రామ్‌గూడ పంచాయతీ పరిధిలో అటవీప్రాంతంలో ఉంది. జిల్లా అటవీ అధికారి ఎస్‌.శాంతారాం, ఎఫ్‌ఆర్‌ఓ తోడిశెట్టి ప్రణయ్‌ ప్రోత్సాహంతో గతవారం మా పరిశీలనలో ఈ గుహ చారిత్రక ప్రాధాన్యం వెలుగులోకి వచ్చింది.

భూగర్భ శాస్త్రవేత్తల సహాయంతో అధ్యయనం చేశాం. గుహ ఇరుగ్గా ఉండటంతో 30 మీటర్ల వరకే పాక్కుంటూ వెళ్లగలిగాం. 54 కోట్ల ఏళ్ల క్రితం భూమిలో సున్నపురాయిని భూగర్భజలంతో తొలచడంతో మొదలైన ఈ ప్రక్రియలో 1.25 లక్షల ఏళ్ల క్రితం ఈ గుహ ఏర్పడి ఉండొచ్చని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ చకిలం వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. గుహపక్కనే జలధార ఉండటం వల్ల పాతరాతి యుగంలో మనుషులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు’ అని శ్రీనివాసన్‌ వివరించారు. అటవీ, పర్యాటకశాఖలు ఈ గుహను పర్యాటక కేంద్రంగా, సాహస పర్యటనలో భాగంగా చేస్తే ప్రకృతి పర్యాటకం, చరిత్ర అధ్యయనానికి లాభం జరుగుతుందన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని