TS News: హుజూరాబాద్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం

తాజా వార్తలు

Updated : 02/08/2021 11:14 IST

TS News: హుజూరాబాద్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి ఖరారు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు అనూహ్యాలకు వేదికవుతున్నాయి.  హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గులాబీ గూటికి వరుసపెట్టి ముఖ్య నాయకులు వెళ్లడం.. ఇంతలోనే ఇటీవల పార్టీలో చేరిన యువనేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేలా నిర్ణయం తీసుకోవడం ఇక్కడి రాజకీయాల్ని మరింత రసవత్తరంగా మారుస్తోంది. గత నెల 21న కాంగ్రెస్‌ పార్టీని వీడిన పాడి కౌశిక్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్‌ యువ నాయకుడు పాడికౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తును రాజకీయంగా అందిస్తామని ప్రకటన చేశారు. ఇందుకు తగినట్లు పక్షం రోజుల వ్యవధిలోనే ఆయన్ను ఎమ్మెల్సీగా చేసే క్రతువును ప్రారంభించారు. ఆదివారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేశారు. త్వరలోనే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రాబోతుండటంతో పార్టీ శ్రేణులతోపాటు ఆయన అనుచరగణంలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అందివచ్చిన అదృష్టం : ఆడియో సంభాషణ అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికైంది. పాడి కౌశిక్‌రెడ్డికి పదవిని తెప్పించేందుకు కారణమైంది. వాస్తవానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తాననేలా ప్రచారాన్ని సాగించిన యువనేత ఊహించని విధంగా నెలరోజుల వ్యవధిలోనే అధికార పార్టీ తరఫున కీలక ప్రజాప్రతినిధిగా మారబోతున్నాడు. రాజకీయాల్లో అందివచ్చే అదృష్టం అంటే ఇదేనేమో అనేలా ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ యువ నాయకుడు ఈసారి ఉప ఎన్నికల కోసం సన్నద్ధమవుతూ గత నెలలో ప్రచారాన్ని కూడా కొనసాగించాడు. ఇల్లందకుంట ఆలయంలో పూజల్ని చేసి కమలాపూర్‌ మండలంలో పర్యటన కొనసాగించారు. అంతకు కొన్నిరోజుల ముందే మంత్రి కేటీఆర్‌ను ఈయన కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ కలయికను కొట్టిపారేసి తానే కాంగ్రెస్‌ పార్టీ తరపున రంగంలో ఉంటానని చెప్పారు. ఇదే సమయంలో గత 12వ తేదీన మాదన్నపేటకు చెందిన ఓ నాయకుడితో ఈయన మాట్లాడిన ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది. రాజకీయ ప్రకంపనల్ని సృష్టించింది. తెరాస టికెట్‌ తనకే వస్తుందనేలా ఉన్న ఈ సంభాషణను కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకోవడంతో.. కౌశిక్‌రెడ్డి అదేరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత 19వ తేదీన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెరాసలో చేరుతానిని చెప్పి రెండ్రోజుల వ్యవధిలోనే గులాబీ కండువాను మెడలో వేసుకున్నారు. ఇక త్వరలోనే ఎమ్మెల్సీగా మారబోతున్నారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన పాడికౌశిక్‌రెడ్డి ఎంబీఏ చదివారు. రంజీ క్రికెట్‌లో రాణిస్తూ జాతీయ స్థాయి కీడ్రాకారుడిగా గుర్తింపు పొందారు. 2008లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వరుసకు సోదరుడవుతారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలో ఈ నాయకుడి సేవల్ని పార్టీకి ఉపయోగించుకునేలా తెరాస కీలక పదవిని కట్టబెడుతోంది. తెరాస టికెట్‌ వస్తుందనే ఉద్దేశంతో పార్టీలో చేరగా, ముందుగానే పదవి రావడంతో ఆయన అనుచరుల్లో ఆనందం కనిపిస్తోంది. మరోవైపు హుజూరాబాద్‌లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఉప ఉన్నికల్లో ఎవరిని రంగంలోకి దింపుతారనే సందిగ్ధత మాత్రం అలాగే కొనసాగుతోంది. బీసీ వర్గానికి చెందిన ఓ యువ నాయకుడి పేరు బలంగా వినిపిస్తోందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని