డెల్టా ప్లస్‌ ప్రమాదకరమనే ఆధారాల్లేవు: డీహెచ్‌

తాజా వార్తలు

Updated : 07/07/2021 12:10 IST

డెల్టా ప్లస్‌ ప్రమాదకరమనే ఆధారాల్లేవు: డీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా వైద్యారోగ్య, విద్యా, పోలీస్‌, జైళ్ల, శిశు సంక్షేమ శాఖలు ధర్మాసనానికి నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ ధర్మాసనానికి వివరించింది. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే మూడో దశను ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. 

రాష్ట్రంలో 1.14 కోట్ల కొవిడ్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. 16.39 లక్షల మందికి రెండు డోసులు పూర్తి అయినట్లు వివరించారు. 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని కోర్టుకు వివరించారు. విద్యాసంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేస్తున్నామన్నారు. సరాసరి రోజుకు 1.12 లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నట్లు డీహెచ్‌ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చినట్లు ధర్మాసనానికి తెలిపారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేట్ వైద్య కేంద్రాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 231 ఆస్పత్రులపై 594 ఫిర్యాదులు వచ్చాయని.. 38 ఫిర్యాదులకు సంబంధించి బాధితులకు 82.64 లక్షలు తిరిగి  ఇప్పించినట్లు డీహెచ్‌ కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 

మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. గత నెల 20 నుంచి ఈ నెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేశామని, రూ.52 కోట్ల జరిమానా విధించామన్నారు. 6,127 ఖైదీలకు ఒక డోసు, 732 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు జైళ్ల శాఖ డీజీ కోర్టుకు వివరించారు. మరో 1244 మంది ఖైదీలకు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ శ్రీదేవసేన ఆన్‌లైన్‌ బోధన మార్గదర్శకాలను కోర్టుకు వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని